ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా? కాదా?

11 February, 2019 - 11:37 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దేశంలో భాగమా? కాదా? అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధానిగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా? వద్దా అంటూ నిలదీశారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అని రాహుల్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా సీఎం చంద్రబాబు 12 గంటల ధర్మ పోరాట దీక్షను సోమవారం ఉదయం ప్రారంభించారు. సభాస్థలికి వచ్చిన రాహుల్ ధర్మ పోరాట దీక్షకు సంఘీభావం తెలిపారు. ముందుగా ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఎక్కడికెళ్తే అక్కడి పాట పాడతారంటూ నిప్పులు చెరిగారు. దేశ ప్రధానిగా ఒక మాట చెప్పారంటే తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ఉందా? లేదా? అని నిలదీశారు.

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా సోమవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు తెలిపాయి. చంద్రబాబు దీక్షా వేదిక మీదకు వచ్చిన ఫరూక్ అబ్దుల్లా సంఘీభావం తెలిపారు. కేంద్రం ధర్మం తప్పిన కారణంగానే ఆంధ్రా ప్రజలు ఢిల్లీ దాకా వచ్చారని ఫరూక్ అన్నారు. భారత దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలని, మోదీ గద్దె దిగాలని అన్నారు. ధర్మం చెబితే సరిపోదని, ఆచరించాలని చెప్పారు. వ్యక్తిగత దూషణలకు ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారకూడదని హితవు పలికారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలుగా విభజించి పాలించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు.