మహిళలకు ఐపీఎల్ మ్యాచ్!

13 May, 2018 - 4:48 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదన వైపు ఓ చిన్న అడుగు ముందుకు పడింది. ఈ నెల 22న ముంబైలో ఐపీఎల్‌ ప్లేఆఫ్‌‌కు ముందు ప్రయోగాత్మకంగా మహిళలకు బీసీసీఐ ఓ ఎగ్జిబిషన్‌ టీ 20 మ్యాచ్‌ నిర్వహించనుంది. ఈ మ్యాచ్‌ కోసం 20 మంది భారత మహిళా క్రికెటర్లతో పాటు పది మంది విదేశీయులు సాధన చేయబోతున్నారు. వీరి నుంచి రెండు జట్లను తయారు చేస్తారు. ఒక జట్టు ఐపీఎల్‌ ఎలెవన్‌ కాగా.. మరొకటి బీసీసీఐ ఎలెవన్‌.

పురుషుల ఐపీఎల్‌ జట్టు‌లో మాదిరిగానే ఒక్కో జట్టులో ఏడుగురు భారతీయులు, నలుగురు విదేశీయులు ఉంటారు. 22న మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. స్టార్‌ స్పోర్ట్స్‌ ఈ మ్యాచ్‌‌ను ప్రసారం చేస్తుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ బోర్డుల్ని సంప్రదించి ఈ మ్యాచ్‌‌లో పాల్గొనే విదేశీ క్రికెటర్ల పేర్లను బీసీసీఐ ప్రకటించనుంది. ఇక భారత మహిళా క్రికెటర్ల వివరాలను సెలక్షన్‌ కమిటీ వెల్లడిస్తుంది.