సన్‌రైజర్స్‌కు అరుదైన రికార్డులు!

11 May, 2018 - 12:19 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఐపీఎల్‌ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అరుదైన మూడు రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌‌‌లు ఆడిన సన్‌‌రైజర్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మొత్తం 9 విజయాలతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్‌ చేరుకున్న తొలి జట్టుగా ఘనత దక్కించుకుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 5 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మ్యాచ్ గెలుచుకుంది.

సన్‌‌రైజర్స్ బౌలర్లపై ఎదురు దాడి చేసిన రిషబ్ పంత్ (128 నాటౌట్) అజేయ సెంచరీతో ఢిల్లీకి భారీ స్కోర్ అందించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌‌‌రైజర్స్ ఆరంభంలోనే ఓపెనర్ హేల్స్ వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ (83) శిఖర్ ధావన్‌ (92)లు కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌‌కు 176 పరుగులు జోడించారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యుత్తమ పార్టనర్‌‌షిప్ కాగా, సన్‌‌రైజర్స్ తరఫున అత్యధిక భాగస్వామ్యం కూడా ఇదే. సన్‌‌రైజర్స్‌‌కు ఇదే అత్యధిక లక్ష్య చేధన కావడమూ గమనార్హం.

2014లో చెన్నై సూపర్ కింగ్స్‌‌పై 186 పరుగులు చేసి గెలవడమే ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌కు అత్యధికం. సన్‌‌రైజర్స్ నెలకొల్పిన నాలుగు అత్యుత్తమ భాగస్వామ్యాల్లో శిఖర్ ధావన్‌ పాత్ర ఉండటం విశేషం. సన్‌‌రైజర్స్ తరఫున అత్యధిక పార్టనర్‌‌షిప్ నెలకొల్పిన (176) ధావన్-విలియమ్సన్ జోడి. వార్నర్-ధావన్ జోడి గతేడాది కోల్‌‌కతా మీద 139 పరుగులు జోడించారు. అంతకు ముందు ఏడాది గుజరాత్‌‌పై వీరిద్దరూ 137 జోడించారు. 2017లో ధావన్-విలియమ్సన్ జోడి ఢిల్లీపైనే 136 పరుగులు జోడించారు.

హైదరాబాద్‌‌కు ఇది వరుసగా ఆరో విజయం కావడం కూడా విశేషమే. గత రెండేళ్లు ఈ జట్టు వరుసగా ఐదేసి చొప్పున విజయాలు సాధించింది. కానీ కోచ్ టామ్ మూడీ నమ్మకాన్ని నిలబెడుతూ ధావన్ ఢిల్లీపై చెలరేగి ఆడాడు. సొంత గడ్డ మీద సిక్స్‌‌‌లు, ఫోర్లతో దాడి చేసి తన సత్తా చూపించాడు.184 సగటుతో.. విలియమ్సన్‌‌తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. కీలకమైన ప్లేఆఫ్ ముంగిట ధావన్ తిరిగి సత్తా చాటడంతో సన్‌‌రైజర్స్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.