రామ్‌చరణ్‌పై ప్రశంసల జల్లు

09 February, 2020 - 4:35 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌పై ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధా మూర్తి ప్రశంసల జల్లు కురిపించారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు.. తనను బాగా ఆకట్టుకుందని సుధామూర్తి అన్నారు.

ఈ చిత్రాన్ని ఇటీవలే చూశానని ఆమె తెలిపారు. అలాగే  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకి తాను పెద్ద ఫ్యాన్ అని ఈ సందర్భంగా సుధా మూర్తి గుర్తు చేసుకున్నారు. ఆయన్ని చూడగానే శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తారని ఆమె పేర్కొన్నారు. అలాగే అన్నమయ్య, మనం, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు వీక్షించానని సుధానారాయణ మూర్తి గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాదు ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ చిత్రంలో సమంత.. రామలక్ష్మీ పాత్రలో నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో వచ్చిన అన్ని పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓ ఇంటర్వ్యూలో సుధామూర్తి ఈ విషయాన్ని వివరించారు.