శ్రీశైలం, సాగర్‌లకు ఈ సీజన్‌లో మొదలైన ఇన్‌ఫ్లో..!

12 June, 2018 - 4:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తూర్పు కర్ణాటకతో పాటు పశ్చిమ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూండటంతో ఈ సీజన్‌లో తొలిసారిగా ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. శ్రీరాంసాగర్, జైక్వాడ్, ఆల్మట్టి జలాశయాలకు ఇన్‌ఫ్లో లేనప్పటికీ, నారాయణపూర్ జలాశయానికి 11,720 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మొత్తం 37.65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 32.14 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 12,067 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 9.66 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల జూరాల జలాశయంలో ప్రస్తుతం 8.11 టీఎంసీల నీరుండగా, 261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,495 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం జలాశయంలో మంగళవారం ఉదయం 5,577 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 142 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 13,642 క్యూసెక్కుల నీటిని కుడి, ఎడమ కాలువలతో పాటు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిలో 8,698 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు చేరుతుండగా, సాగర్ నుంచి 21,354 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సోమశిల జలాశయానికి 1,039 క్యూసెక్కులు, ఏలేరు జలాశయానికి 221 క్యూసెక్కులు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 875 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది.