నీరవ్ మోడీకి బ్రిటన్ గోల్డెన్ వీసా!

15 March, 2019 - 2:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి, మోస్ట్ వాంటెడ్ నీరవ్ మోడీకి బ్రిటిష్ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది. ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ కీలక నిందితుడిగా ఉన్నాడు.

యూరోప్ బయటి దేశాలకు చెందిన వారు యూకే ప్రభుత్వ కంపెనీల్లో బాండ్లు, షేర్లలో రెండు మిలియన్ల పౌండ్లు పెట్టుబడిగా పెడితే వారికి బ్రిటిష్ ప్రభుత్వం గోల్డెన్ ఇన్వెస్టర్ వీసా జారీ చేస్తుంది. యూకే ప్రభుత్వం నీరవ్ మోడీకి భారత పాస్‌పోర్టుపై ఈ గోల్డెన్ వీసా జారీ చేసింది. ఆర్థిక నేరస్థుడైన నీరవ్ మోడీపై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. యూకేలో గోల్డెన్ వీసా పొందిన వారు దేశంలో పనిచేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు. దీంతో పాటు గోల్డెన్ వీసా ఉన్నవారికి యూకేలో శాశ్వత నివాసం కల్పించుకునే కూడా అర్హత వస్తుంది.

నీరవ్ మోడీ లండన్ నగరంలోని వెస్ట్ ఎండ్‌లో 8 మిలియన్ యూరోల విలువ గల ఫ్లాట్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. సెంట్రల్ పాయింట్ లండన్ అపార్టుమెంట్ బ్లాకులో నివాసముంటూ వజ్రాల వ్యాపారం చేస్తున్నాడని తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్లు ఎగ్గొట్టిన నిందితుడైన నీరవ్ మోడీ లండన్ రాక ముందు న్యూయార్క్ నగరంలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో కొన్నాళ్లు ఉన్నాడని తేలింది.

గత ఏడాది నవంబరులో ఇంటర్‌పోల్ నీరవ్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నీరవ్ మోడీ స్కాటిష్ ప్రొవిడెంట్ హౌస్ కాలేజీ రోడ్డు కేంద్రంగా ఉన్న భవనంలో హోల్‌సేల్‌గా వజ్రాభరణాలు, గడియారాలు, నగలను విక్రయిస్తున్నాడని తేలింది. బారు మీసాలు, జుట్టు పెంచి జాకెట్ ధరించి వేషధారణ మార్చినా నీరవ్ మోడీని సులభంగా గుర్తించవచ్చు. నీరవ్ మోడీపై రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసినా అతనిపై బ్రిటన్ అధికారులు చట్టపరంగా ఇంకా చర్యలు ప్రారంభించకపోవడం గమనార్హం.