మారుమూల రైల్వేస్టేషన్లలోనూ వైఫై!

07 January, 2018 - 8:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: దేశంలో మారుమూల ప్రాంతాల రైల్వే స్టేషన్లకూ ఇకపై హైటెక్‌ హంగులు సమకూరనున్నాయి. దేశంలోని 8,500 రైల్వే స్టేషన్లలో రూ. 700 కోట్లతో వైఫై సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం దేశంలోని 216 ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు ఉచిత ఇంటర్‌‌నెట్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో రోజువారీ పనుల్లో ఇంటర్‌‌నెట్‌ కీలక అవసరం అయింది. దీంతో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ సౌకర్యాన్ని విస్తరింపచేస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి వెల్లడించారు. తొలుత దేశవ్యాప్తంగా 1,200 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయం జరిగిందని.. త్వరలోనే దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని 7,300 స్టేషన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రణాళిక ఖరారైందని రైల్వే వర్గాలు తెలిపాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో వైఫైతో కూడిన కియోస్క్‌‌లు డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఆధార్‌ జనరేషన్‌, బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు వంటి ప్రభుత్వ ధృవపత్రాల జారీ సేవలు అందిస్తాయి. ఈ ఏడాది మార్చి నాటికి 600 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పిస్తారు. ఇక మార్చి 2019 నాటికి దేశవ్యాప్తంగా 8,500 స్టేషన్లలో ఈ సదుపాయం విస్తరించాలని రైల్వేలు ఆలోచిస్తున్నాయి.