ప్రపంచం ప్లాస్టిక్ రహితం కావాలి

23 September, 2019 - 11:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూయార్క్: ప్లాస్టిక్ రహిత ప్రపంచం ఆవిష్కృతం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వాతావరణ మార్పుల్ని అధిగమించేందుకు ప్రపంచ దేశాలు ఇప్పుడు చేస్తున్న కృషి సరిపోదని అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పుల్ని ఎదుర్కొనేలా మానవాళిలో మార్పు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఉద్యమం తప్పనిసరి అని మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో టన్నుల కొద్దీ మాటల కంటే ఒక ఔన్సు కార్యాచరణ ఎంతో గొప్పదని మోదీ ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితిలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

వాతావరణ మార్పుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని ఈ అంతర్జాతీయ వేదిక నుంచి మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత్ కార్యాచరణ మార్గసూచీతో సిద్ధంగా ఉందన్నారు. వాతావరణ సమస్యపై మాట్లాడుకునే సమయం అయిపోయిందని, ఇక చర్యలు తీసుకోవాల్సిన టైమ్ వచ్చిందన్నారు.  450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనశక్తి సాధన దిశగా భారత్ అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు. ప్రకృతిని భారత్ ఎప్పుడూ ఓ అవసరంగానే భావిస్తుంది తప్ప, ప్రకృతిపై అత్యాశకు పోదని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత దేశంగా భారత్ అడుగులు వేస్తోందని, ప్రపంచమంతా ఈ దిశగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొన్నారు.