ఎలాంటి సవాళ్ళకైనా భారత సైన్యం రెడీ

09 August, 2017 - 9:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: డోక్లాంలో చైనాతో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటుందన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. పొరుగు దేశాల నుంచి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా భారత్‌‌కు ఉందని జైట్లీ స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతోందని జైట్లీ అన్నారు. 1962లో చైనాతో యుద్ధం తర్వాత దేశ సైన్యం నిరంతరం సిద్ధంగా ఉండాలనే పాఠాన్ని నేర్చుకుందన్నారు. పొరుగు దేశాల నుంచి భారత్‌ పలు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. వాటిని తిప్పి కొడుతూ దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు మన వీర సైనికులు నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సైనికులు ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోరని అరుణ్ జైట్లీ చెప్పారు.