మన బాక్సర్ చారిత్రక ‘సిల్వర్ పంచ్’

22 September, 2019 - 5:06 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ఎకటెరిన్‌బర్గ్‌ (రష్యా): ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత బాక్సర్‌గా చరిత్రకెక్కాలన్న అమిత్‌ పంఘాల్‌ కల ఫలించలేదు. అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ వరకూ చేరిన అమిత్ తుదిపోరులో ఓటమి చవిచూసి రెండో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. శనివారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్లో షఖోబిదిన్‌ జొయిరొవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) 30–27, 30–27, 29–28, 29–28, 29–28 (5–0) స్కోరుతో అమిత్‌ను ఓడించాడు. అయితే.. అమిత్‌ పంఘాల్ సాధించిన ఈ  ఘనత చిన్నదేం కాదు. ఇప్పటి వరకూ విశ్వ వేదికపై కాంస్య పతకాలకే భారత బాక్సర్లు పరిమితం కాగా.. 24 ఏళ్ల అమిత్‌ తొలిసారి దేశానికి రజత పతకాన్ని సాధించిపెట్టాడు. ఈ టోర్నీలో శుక్రవారం సెమీస్‌లో ఓడిన మనీశ్‌ కౌశిక్‌కు దక్కిన కాంస్యంతో కలిపి భారత్‌ తొలిసారి ఒకే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలవడం విశేషం.

ఫైనల్లో కూడా అమిత్‌కు ప్రత్యర్థిగా తనకంటే ఎంతో పొడవైన బాక్సర్‌ తారసపడ్డాడు. తొలి మూడు నిమిషాల్లో ఇద్దరు బాక్సర్లు జాగ్రత్తగా ఆడుతూ దూకుడుకు అవకాశం ఇవ్వలేదు. రెండో రౌండ్‌లో అమిత్‌ తన ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా షఖోబిదిన్‌ సమర్థంగా ఎదుర్కొన్నాడు. అమిత్‌ కొట్టిన కొన్ని పంచ్‌లు సరైన దిశలో వెళ్లకపోవడంతో తగిన పాయింట్లు దక్కలేదు. మూడో రౌండ్‌లో ఇద్దరూ ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. భారత బాక్సర్‌ చెలరేగి ఉజ్బెక్‌ బాక్సర్‌ను పదే పదే బలంగా దెబ్బకొట్టినా.. చివరికి స్కోరింగ్‌ పంచ్‌లు మాత్రం షఖోబిదిన్‌ ఖాతాలోనే పడ్డాయి. అమిత్ ఓడినట్లు రిఫరీ ప్రకటించడంతో నిరాశగా వెనుదిరిగాడు.