మంచులో ‘యతి’ అడుగుజాడలు!

30 April, 2019 - 1:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారీ శరీరంతో భయంకరంగా కన్పించే మంచు మనిషి యతి గురించి పురాణాలు, పాత సినిమాల్లో అప్పుడప్పుడూ వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. యతి అనేది ఓ కల్పిత పాత్ర మాత్రమే అని చెబుతున్నా.. నిజంగా భూమిపై యతి మంచుమనిషి ఉన్నాడని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా భారత ఆర్మీ కూడా యతి అస్థిత్వంపై ఆసక్తికరమైన ట్వీట్‌ చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను గుర్తించినట్లు భారత సైన్యం వెల్లడించింది.

హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్‌ 9న మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్చితంగా ‘యతి’వే అయి ఉంటాయని ఆర్మీ తన అధికారిక ట్విట్టర్‌‌లో పోస్టు చేసింది. గతంలో కూడా మకలు-బరున్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో యతి అడుగులు కన్పించినట్లు సైన్యం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆర్మీ ట్విట్టర్‌‌లో పోస్టు చేసింది. అయితే ఈ ఫొటోల్లో కేవలం ఒక కాలి ముద్రలు మాత్రమే ఉండటం గమనార్హం.

యతి.. అనేది ఇప్పటివరకూ పురాణాల్లో, జానపద కథల్లో వినిపించే ఓ కల్పిత పాత్ర మాత్రమే. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ మంచు మనిషి తిరుగుతున్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. మంచుపై కన్పించిన పాద ముద్రల ఆధారంగానే అప్పుడు కూడా కథనాలు వచ్చాయి.