‘కోహ్లీ జట్టునుంచి తప్పుకోవాలి’

14 January, 2018 - 10:40 AM

 

(న్యూవేవ్స్ డెస్క్)

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులోకి రహానే వస్తాడని అందరూ భావించగా అది జరగకపోగా ధవన్, భువనేశ్వర్, వృద్ధిమాన్ సాహాలను తప్పించి వారి స్థానంలో కేఎల్ రాహుల్, ఇషాంత్ శర్మ, పార్థివ్ పటేల్‌లకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై తాజాగా టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఒక టెస్టులో సరైన ప్రదర్శన చేయలేదన్న కారణంతో ధవన్‌ను తప్పించేశారని, మరి ఎటువంటి కారణం లేకుండా భువనేశ్వర్‌ను ఎందుకు తప్పించారని ప్రశ్నించాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైతే మూడో టెస్టు నుంచి కోహ్లీ తప్పుకోవాలని సెహ్వాగ్ డిమాండ్ చేశాడు.

తొలి టెస్టులో ఆరు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లో అందరికంటే ఎక్కువ బంతులు ఆడిన భువనేశ్వర్‌ను రెండో టెస్టులో పక్కనపెట్టడంపై అభిమానుల నుంచే కాకుండా.. మాజీ క్రికెటర్లు, విమర్శకుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి టెస్టు కోసం ఫామ్ ఆధారంగా రోహిత్‌ను ఎంపిక చేసినట్టు చెప్పిన కోహ్లీ.. మరి ఫామ్‌లో వున్న భువీని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.