బెంగళూరు టీ20కీ వానగండం?

21 September, 2019 - 9:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: దక్షిణాఫ్రికా జట్టు ఇండియా టూర్‌లో భాగంగా జరుగుతున్న మూడు టీ20 సీరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌ను మాత్రం ఆతిథ్య భారత్ ఆల్‌రౌండ్ ప్రతిభతో సఫారీలపై విజయం సాధించింది. ఇక ఈ సీరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరగాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌కు కూడా వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సీరీస్‌ను దక్కించుకోవాలని విరాట్ సైన్యం పట్టుదలతో ఉంది. ఎలాగైనా మూడో మ్యాచ్‌ గెలిచి సీరీస్‌ను 1-1తో సమం చేసి, పరువు దక్కించుకోవాలని సఫారీ జట్టు భావిస్తోంది.

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆదివారం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. దక్షిణాఫ్రికా- భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశాలు 30 నుంచి 40 శాతం ఉన్నాయన్నది వాతావరణ శాఖ విశ్లేషణ. అల్పపీడనం ప్రభావంతో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడాన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.