భారత్- కివీస్ సెమీస్‌కి వానగండం

09 July, 2019 - 8:18 AM

(న్యూవేవ్స్ డెస్క్)

మాంచెస్టర్‌ (ఇంగ్లండ్): ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం మాంచెస్టర్ వేదికగా జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా, నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌ మధ్య ఈ పోరు జరగనుంది. ఈ వేదిక కోహ్లీసేనకు అచ్చొచ్చింది. తొలి నాకౌట్‌ పోటీ కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్లలో ముందుగా ఏది ఫైనల్‌ పోటీకి అర్హత సాధిస్తుందో అని ఉత్కంఠతో ఉన్నారు. ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీలో కొద్ది రోజుల క్రితం వరకూ కొన్ని మ్యాచ్‌లకు ఆటంకంగా మారిన వరుణుడు అనంతరం కొంత జోరు తగ్గించాడు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సెమీస్‌ పోరును కూడా వీక్షించేందుకు వరుణుడు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మాంచెస్టర్‌ ఇప్పుడు మేఘావృతమైంది. ఆకాశంలో నీలిమబ్బులు కమ్ముకున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మ్యాచ్‌ రోజైన మంగళవారం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సెమీస్‌ సవ్యంగా సాగుతుందో లేదో అని అభిమానులు సందేహంలో పడిపోయారు. పోరు మొదలై మధ్యలో ఆగితే రిజర్వు డే ఉంటుంది. మ్యాచ్‌ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే రిజర్వ్ డే నాడు మొదలుపెడతారు. ఆ రోజున కూడా వర్షం వచ్చేందుకు 60 శాతం అవకాశం ఉందని బ్రిటన్‌ వాతావరణ శాఖ వెల్లడించడం గమనార్హం.

అలా రెండు రోజులూ వర్షం కురిసి మ్యాచ్‌ ఫలితం తేలకపోతే భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. కోహ్లీసేన లీగ్‌ దశలో ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే దీనికి కారణం. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి  15 పాయింట్లతో టీమిండియా మొదటి స్థానంలో ఉంది. ఇదే కివీస్‌తో లీగ్‌ మ్యాచ్‌ వర్షం వద్ద రద్దయిన విషయం తెలిసిందే. దాంతో రెండు జట్లకు చెరో పాయింటును ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వీరి మ్యాచ్‌కే వరుణుడు అంతరాయం కలిగిస్తుండటం గమనార్హం.