రెండో టీ20: భారత్ భారీ విజయం

08 November, 2019 - 5:27 AM

(న్యూవేవ్స్ డెస్క్)

రాజ్‌కోట్‌: కెప్టెన్ రోహిత్‌శర్మ మెరుపు బ్యాటింగ్‌ సౌరాష్ట్ర క్రికెట్‌ స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించింది. రోహిత్ పరుగుల ప్రవాహంతో భారత్‌ రెండో టీ20లో అలవోకగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పర్యాటక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సీరీస్‌ను 1-1తో సమం చేసింది. రాజ్‌కోట్ వేదికగా గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌టీలో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తు చేసింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 153 పరుగులు చేసింది. మహమ్మద్‌ నయీమ్‌ (31 బంతుల్లో 36), సౌమ్య సర్కార్‌ (20 బంతుల్లో 30) రాణించారు. భారత స్పిన్నర్‌ చహల్‌ రెండు వికెట్లు తీశాడు. తరువాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 15.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 154 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (43 బంతుల్లో 85- 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి టీమిండియాకు గెలుపుబాట వేశాడు. శిఖర్‌ ధావన్‌ (27 బంతుల్లో 31- 4 ఫోర్లు) రాణించాడు.

సీరీస్‌ చేజార్చుకోకుండా ఉండాలంటే ఛేదించాల్సిన లక్ష్యాన్ని రోహిత్‌ సులువుగా మార్చేశాడు. టీ20 మెరుపులకు సరిగ్గా సరిపోయే ఇన్నింగ్స్‌తో చెలరేగి ఆడాడు. ఆరు బౌండరీలు ఆరు సిక్సర్లతో బంగ్లాదేశ్ బౌలర్లపై రోహిత్ విరుచుకుపడ్డాడు. కానీ.. ఆరంభంలో రోహిత్ ఆట చాలా నెమ్మదిగా మొదలైంది. ఆ తర్వాత తుపాను ఇన్నింగ్స్‌కు సంబంధించిన ‘షో’ మొదలైంది. ముస్తాఫిజుర్‌ ఓవర్లో రెండు ఫోర్లు, బౌలర్‌ తలపై నుంచి ఓ భారీ సిక్సర్‌ కొట్టేశాడు. ఆ తర్వాత ఇస్లామ్‌ను ఓ బౌండరీ, సిక్సర్‌తో శిక్షించాడు. 5.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరింది. మొసద్దిక్‌ హుస్సేన్‌ వేసిన పదో ఓవర్‌లో రోహిత్‌ మరింతగా చేలరేగిపోయాడు. తొలి మూడు బంతులు సిక్సర్లుగా బాదాడు! ఆ ఓవర్‌ పూర్తికాక ముందే 9.2 ఓవర్లకే భారత్‌ 100 పరుగులు పూర్తయ్యాయి. రోహిత్‌ ధాటికి రెండో ఫిఫ్టీకి కేవలం 4 ఓవర్లే అవసరం అయ్యాయి. 11వ ఓవర్లో ధావన్‌ ఔట్‌ అవడంతో 118 పరుగుల భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరో రెండు ఓవర్లకే రోహిత్‌ కూడా ఔటైనా.. మిగతా లాంఛనాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ (13 బంతుల్లో 24 నాటౌట్‌- 3 ఫోర్లు, 1 సిక్స్‌), లోకేశ్‌ రాహుల్‌ (8 నాటౌట్‌) అజేయంగా పూర్తిచేశారు.

అంతకు ముందు టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. బంగ్లా ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు లిటన్‌ దాస్, నయీమ్‌ శుభారంభం ఇచ్చారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన ఖలీల్‌ అహ్మద్‌కు నయీమ్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో స్వాగతం పలికాడు. పవర్‌ప్లే ముగిసేలోపే 5.4 ఓవర్లలోనే బంగ్లాదేశ్‌ 50 పరుగులు చేసింది. పిచ్‌ స్వభావరీత్యా ఇక భారీస్కోరు ఖాయం అనిపించింది. సాఫీగా.. ధాటిగా సాగిపోతున్న ఓపెనింగ్‌ జోడీని రనౌట్‌ విడగొట్టింది. తొలి వికెట్‌ కూలిపోయిక భారత బౌలర్లు జాగ్రత్తపడ్డారు. ప్రత్యర్థిని చక్కగా కట్టడి చేశారు. ఆఖరి ఓవర్లలో కెప్టెన్‌ మహ్మదుల్లా (21 బంతుల్లో 30- 4 ఫోర్లు) బౌండరీలు చేయడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది.