ఆసీస్‌కు రక్షణగా ఎండా.. వాన..!

06 January, 2019 - 2:02 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సిడ్నీ: టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న ఆఖరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వర్షం, వెలుతురు లేని కారణంగా ముందుగా అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంతసేపు నిరీక్షించినా పరిస్థితి మెరుగవకపోవడంతో నాలుగో రోజు ఆట ముగిస్తున్నట్లు వారు ప్రకటించారు. భారత్ చేతిలో ఫాలో ఆన్ ఆడుతున్న ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను అటు వరుణుడు, ఇటు సూర్యుడు రక్షిస్తున్నట్లుగా ఉంది. లంచ్ వరకూ వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. ఆపైన వెలుతురు తగ్గిపోయింది.

మొదటి ఇన్నింగ్స్‌‌లో భారత్‌పై 322 పరుగులు వెనకబడిన ఆసీస్ జట్టు ఫాలో ఆన్‌ ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా (4), మార్కస్‌ హారిస్‌ (2)ఉన్నారు. ఆట ముగిసే సమయానికి నాలుగు ఓవర్లకు వికెట్ కోల్పోకుండా ఆసీస్‌ ఆరు పరుగులు చేసింది.ఆట నాలుగోరోజు లంచ్ సమయం వరకూ వర్షం పడుతూండటంతో అసలు బ్యాటింగే ప్రారంభం కాలేదు. ఆపై గంటన్నర వ్యవధిలోనే ఆస్ట్రేలియా జట్టు 300 పరుగులకు ఆలౌట్ అయి, భారత స్కోరు కన్నా 322 పరుగులు వెనుకబడింది. ఆ వెంటనే ఫాలోఆన్ ఆడించాలని భారత్ నిర్ణయించింది. దీంతో మార్కస్ హాసిర్, ఖావాజా ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆట నాలుగు ఓవర్ల పాటు సాగి, ఆసీస్ స్కోరు 6 పరుగులకు చేరిన సమయంలో ఆటకు తగినంత సూర్యకాంతి లేనందున ఎంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. ఆపైన ఇక సూర్యుడు కనిపించలేదు. దీంతో ఆ తరువాత ఒక్క బంతి కూడా పడకుండానే నాలుగో రోజు ఆట ముగిసిపోయింది. ఇక రేపు ఆట ఆఖరి రోజు కాగా, ఆసీస్ ఆటగాళ్లు నిలిస్తే, మ్యాచ్ డ్రా అవుతుంది.

ఇక భారీ ఆధిక్యం సాధించిన భారత్‌‌కు విజయం తథ్యం అనుకుంటుండగా వరుణుడు అడ్డంకి అయ్యాడు. వర్షం కారణంగానే నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. చివరికి వెలుతురు లేకపోవడంతో మ్యాచ్‌‌ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగో రోజు కేవలం 25.2 ఓవర్లే అయ్యాయి. చివరిదైన ఐదో రోజు వాతావరణం సహకరిస్తేనే టీమిండియా గెలుపు సాధ్యం అవుతుంది.