భారత్ చేతికి ‘స్విస్ ఖాతా’ లిస్ట్!

08 October, 2019 - 2:45 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: సమాచార మార్పిడి కొత్త ఒప్పందానికి అనుగుణంగా స్విస్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో భారతీయుల ఖాతాల వివరాలతో కూడిన తొలి సమాచారం భారత్‌ చేతికి అందింది. విదేశాల్లో దాగిన నల్లకుబేరుల బ్లాక్‌మనీ వెలికితీసే ప్రక్రియలో ఇది భారీ ముందడుగుగా భావిస్తున్నారు. భారత్‌తో పాటు 75 దేశాలు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ (ఎఫ్‌టీఏ) నుంచి ఈ తరహా సమాచారం పొందుతాయని ఎఫ్‌టీఏ ప్రతినిధి వెల్లడించారు. ఆటోమేటిక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏఇఓఐ) ఫ్రేమ్‌వర్క్‌ కింద స్విట్జర్లాండ్‌ నుంచి భారత్‌ తమ ఖాతాదారుల వివరాలపై సమాచారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

స్విస్‌ బ్యాంకుల్లో 2018లో చురుకుగా ఉన్న భారతీయుల ఖాతాలు, క్లోజయిన ఖాతాల వివరాలను కూడా తాజా సమాచారంలో పొందుపరిచారు. 2020 సెప్టెంబర్‌లో తదుపరి సమాచార మార్పిడి జరుగుతుందని ఎఫ్‌టీఏ ప్రతినిధి తెలిపారు. ఎఫ్‌టీఏ మొత్తంమీద 75 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకోగా, వారి నుంచి 24 లక్షల ఖాతాల సమాచారాన్ని సేకరించింది. ఈ డేటాలో బ్యాంకు ఖాతాదారు పేరు, ఖాతా సంఖ్యతో పాటు ఖాతాదారుని అడ్రస్‌, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య సహా బ్యాంకు, ఆర్థిక సంస్థ పేరు ఖాతాదారు ఖాతాలో ఉన్న నిధుల వివరాలు, క్యాపిటల్‌ ఇన్‌కమ్‌ వంటి పలు వివరాలు ఉంటాయి.

భారత్‌కు స్విస్‌ బ్యాంకుల నుంచి లభించిన వివరాలతో అనధికార సంపద పోగేసిన వారిపై గట్టి చర్యలు చేపట్టేందుకు వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఖాతాలకు సంబంధించి డిపాజిట్లు, నగదు బదిలీ, పెట్టుబడుల ద్వారా రాబడులు వంటి కీలక సమాచారం వెల్లడవడంతో నల్లకుబేరుల గుట్టుమట్లు దర్యాప్తు అధికారులకూ కీలక ఆధారాలుగా మారనున్నాయి. కాగా స్విస్‌ యంత్రాంగం అందించిన సమాచారం ఎక్కువగా భారత వాణిజ్యవేత్తలు, అమెరికా, బ్రిటన్‌ సహా ఆఫ్రికా దేశాల్లో స్ధిరపడిన ఎన్‌ఆర్‌లకు చెందినవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నల్లధనంపై ఉక్కుపాదం మోపాలని పలు దేశాలు నిర్ణయించిన క్రమంలో పలువురు భారతీయులు 2018లోనే స్విస్‌ సహా విదేశీ బ్యాంకుల్లో తమ ఖాతాలను మూసివేశారని తాజా జాబితా ప్రకారం వెల్లడవుతున్నట్లు తెలుస్తొంది.

నిజానికి భద్రతకు, గోప్యతకు మారుపేరుగా నిలిచే స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డబ్బు, బంగారం దాచుకోవడం ఈనాటిది కాదు. అయితే.. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు సరైన లెక్కలు చూపకపోతే అది నల్లధనం కిందే లెక్క! ఇలాంటి ఖాతాలు లెక్కకు మిక్కిలి ఉన్నట్టు గత ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించినా, ఆ నల్లధనాన్ని స్వదేశానికి చేర్చే ప్రక్రియ మోదీ హయాంలో ఊపందుకుంది.