అమెరికా వస్తువులపై భారత్ ప్రతీకార సుంకాలు!

16 June, 2019 - 3:38 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై సుంకాలను భారతదేశం పెంచింది. జూన్‌ 16 ఆదివారం నుంచే ఈ కొత్త సుంకాలు అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వీటిలో బాదం, వాల్‌నట్స్‌, కాయధాన్యాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆర్థికశాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారతదేశం నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై గతేడాది మార్చిలో అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారతదేశం అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్‌నట్‌ తదితర 29 వస్తువులపై పన్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. అమెరికాలో తయారై, అక్కడి నుంచి ఇండియాకు దిగుమతి అయ్యే వస్తువులకు ఇది వర్తిస్తుందని తెలిపింది.

భారత్ నిర్ణయంతో వాల్‌నట్‌పై 30 శాతం నుంచి 120 శాతానికి, పప్పులపై 30 నుంచి 70 శాతానికి పన్ను పెరగనుంది. ఫలితంగా ఈ 29 వస్తువులపై పన్ను భారం పెరిగి, దేశీయ మార్కెట్‌లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. భారతదేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా సుంకాలు పెంచినందుకు ప్రతిగా గతేడాది జూన్‌లోనే ఆయా వస్తువులపై పన్ను పెంచాలని భారత్‌ యోచించింది. అయితే.. పలు కారణాల వల్ల ఈ నిర్ణయం పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) కార్యక్రమం నుంచి భారత్‌ను తొలగించిన నేపథ్యంలో పెంపు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికాకు తెలియజేసినట్లు సమాచారం. భారత ప్రభుత్వం తాజా నిర్ణయంతో 29 ఉత్పత్తులపై అమెరికా ఎగుమతిదారులు కస్టమ్స్‌ సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందువల్ల సుమారు 217 మిలియన్‌ డాలర్ల ఆదాయం భారత్‌కు ద్వారా సమకూరనుంది. కాగా.. అమెరికా ప్రభుత్వం చర్యతో భారత్‌కు 2.4 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది.