లంకను ఆటాడుకున్న భారత్

07 July, 2019 - 3:55 AM

(న్యూవేవ్స్ డెస్క్)

లీడ్స్‌ (ఇంగ్లండ్): ఐసీసీ ప్రపంచకప్‌ 2019 లీగ్ దశలో నామమాత్రంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌ను కూడా విరాట్ సేన వదిలిపెట్టలేదు. ఈ టోర్నీలో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక బౌలర్లను టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ జంట చెడుగుడు ఆడుకుంది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 43.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. భారతజట్టు ఓపెనర్లు రోహిత్‌ శర్మ (103- 94 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (111- 118 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీలు చేశారు. ఓపెనర్లు సెంచరీలు చేయడంతో భారత జట్టు సులువుగానే విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి (34 నాటౌట్‌- 41 బంతుల్లో 3 ఫోర్లు) చివరి వరకూ క్రీజులోనే నిలబడి జట్టుకు విజయాన్నందించాడు. లంక బౌలర్లలో ఉదాన, రజిత, మలింగ చెరో వికెట్‌ తీశారు. సెంచరీ కొట్టి తమ జట్టుకు ఈజీ విజయాన్ని అందించిన రోహిత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్‌ చేసిన లంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి 264 పరుగులు చేసింది. మాథ్యూస్‌ (113- 128 బంతుల్లో 10×4, 2×6) శతకం సాధించాడు. తిరుమన్నె(53- 68 బంతుల్లో 4×4) పోరాడాడు. బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ల బ్యాటింగ్ హైలెట్‌ అని చెప్పాలి. రోహిత్‌ మైదానం నలువైపులా బౌండరీలు బాదాడు. కేఎల్ రాహుల్‌ ప్రపంచకప్‌లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు.

భారీ లక్ష్యం కాకపోవడంతో భారత్‌ ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ జోడీ తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించింది. తొలి 10 ఓవర్లలో 59 పరుగులు చేశారు. తర్వాత గేర్‌ మార్చి ఆడిన రోహిత్‌ భారీ షాట్లతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 29వ ఓవర్‌లో రజిత బౌలింగ్‌లో ఆఖరి బంతిని బౌండరీకి తరలించి రోహిత్‌ సెంచరీ ముగించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌కు ఇది ఐదవ సెంచరీ. మరో మూడు పరుగులు జోడించి 31వ ఓవర్‌లో మాథ్యూస్‌ చేతికి చిక్కడంతో రోహిత్‌ మైదానాన్ని వీడాడు. మరోవైపు నిదానంగా ఆడుతూ వచ్చిన కేఎల్‌ రాహుల్‌ కూడా 39వ ఓవర్‌లో శతకం చేశాడు. కానీ కాసేపటికే 41వ ఓవర్‌లో మలింగ బౌలింగ్‌లో 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. తర్వాత వచ్చిన పంత్‌ (4) ఎల్బీ అయ్యాడు. అప్పటికే క్రీజులో ఉన్న కోహ్లీ.. పాండ్య (7నాటౌట్‌)తో కలిసి లాంఛనాన్ని పూర్తిచేశాడు.

అంతకు ముందు శ్రీలంక సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ (113- 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో రాణించాడు. లహిరు తిరిమన్నే(53- 68 బంతుల్లో 4 ఫోర్లు) అర్దసెంచరీతో మెరిశాడు. దీంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు. లంకేయులకు ఆదిలోనే షాక్‌ తగలింది. లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే(10) నిరాశపరిచాడు. కాసేపటికే మరో ఓపెనర్ కుశాల్‌ పెరీరా (18) కూడా పెవిలియన్‌ చేరాడు. దాంతో లంక 40 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లను  జస్‌ప్రీత్‌ బుమ్రా సాధించాడు. కొద్ది సేపటి తర్వాత అవిష్కా ఫెర్నాండో (20)ను హార్దిక్‌ పాండ్యా ఔట్ చేశాడు. కుశాల్‌ మెండిస్‌కు జడేజా పెవిలియన్ దారి చూపించాడు. దాంతో 55 పరుగులకే శ్రీలంక నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఆ తర్వాత తనకు భారత్‌పై ఉన్న మంచి రికార్డును కొనసాగిస్తూ మాథ్యూస్‌ సమయోచితంగా ఆడాడు. చివర్లో డిసిల్వా (29 నాటౌట్‌) మెరుపుల మెరిపించడంతో శ్రీలంక 265 పరుగుల టార్గెట్‌ నిర్దేశించగలిగింది.

ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానానికి దూసుకెళ్లింది. మొత్తం లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తికాగా భారత్ 9 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. టీమిండియా ఖాతాలో 7 విజయాలు, ఒక ఓటమి ఉన్నాయి.