కర్ణాటక పవర్ ఎవరి చేతికో…!

06 May, 2018 - 2:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పార్టీ పంజాబ్, పుదుచ్చేరి, పరివార్ (పీపీపీ)గా మారిపోతుందంటూ ఎద్దేవా చేశారు. మే 15 కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పీ అంటే పంజాబ్, పీ అంటే పుదుచ్చేరి, పీ అంటే పరివార్.. కుటుంబం మాత్రమే మిగులుతుందన్నారు.

పార్లమెంటులో 400 ఎంపీలు మొదలు పంచాయతి నుంచి పార్లమెంటు వరకు కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఉనికిని కోల్పోతోందని, ఒక దాని తర్వాత ఒకటి కోల్పోతోందని, నీరు లేని చేప మాదిరిగా మారిపోతోందని ప్రధాని ఎద్దేవా చేశారు. జేడీఎస్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. ఆర్బీఐ, ఇండియన్ ఆర్మీ, పార్లమెంటు ఇలా అన్నింటినీ విపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు.

మరోవైపు, బీజేపీపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ అక్కున చేర్చుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా వాళ్ల ఓట్ల శాతం గణనీయంగా తగ్గుతూ వస్తోందన్నారు. కర్ణాటకలో వారికి అడ్డుకట్ట వేస్తే ఇక అంతటా కాంగ్రెస్‌ పుంజుకుని 2019 నాటికి కేంద్రంలో ప్రజలు కోరుకునే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆవిర్భవిస్తుందని అన్నారు. బీజేపీవి అన్నీ అబద్దాలే అన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనం వెలుగులోకి తెస్తామని మోదీ చెప్పారని, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారని, ఇలాంటి బోగస్‌ ప్రధాని మనకు కావాలా అని ఖర్గే ప్రశ్నించారు. రాష్ట్రంలో జేడీఎస్‌ మాటకొస్తే అదో గెలవలేని గుర్రం అన్నారు. కుమారస్వామి పదేపదే తానే కింగ్‌ మేకర్‌ అని చెబుతారు. ఇంకొకరిని కింగ్‌ చేద్దామని ఈయన మేకర్‌ అవుతున్నారన్నారు.

నమ్మించి ప్రజలను మోసం చేయటంలో మోదీ నాయకత్వంలోని బీజేపీని మించిన పార్టీ మరొకటిలేదని ఖర్గే అన్నారు. ప్రజల బలహీనతలను ఎలా సొమ్ము చేసుకోవాలో మోదీకి తెలిసినంతగా మరొకరికి తెలియదని ఖర్గే అన్నారు. కేంద్రం ఉత్తరాదికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వటం లేదన్నారు. బీజేపీ మాయమాటలు నమ్మకుండా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌‌గా సర్వేలు వెల్లడించాయి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు ఎక్కువగా వస్తాయని తేల్చాయి. అయితే మోదీ ప్రచారం అనంతరం బీజేపీ సుడి తిరుగుతుందని, గాలి బీజేపీ వైపు మరలుతుందని చాలామంది నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా యెడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులకు టిక్కెట్ల కారణంగా బీజేపీ కొంత ఇరకాటంలో పడింది.

యూపీ, గుజరాత్‌‌లలో మోదీ ప్రచారమే బీజేపీ గెలవడానికి కారణమని చాలామంది భావిస్తారు. ఇప్పుడు మోదీ కర్ణాటకలో కూడా వరుసగా సభల్లో పాల్గొంటున్నారు. మోదీ కర్ణాటకలోని అంశాలను స్పృశించడంతో పాటు సగటు ఓటరుపై కూడా దృష్టి సారించారు. మోదీ పర్యటన తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మోదీ ప్రచారం క్రమంగా సత్ఫలితాలు ఇస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. యెడ్యూరప్ప కంటే ప్రధాని మోదీ సభలకు జనం బాగా తరలి వస్తున్నారు.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ బొటాబొటిన గెలిచే స్థానాలపై అమిత్ షా దృష్టి సారించారు. కాగా.. బీజేపీ మేనిఫెస్టో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకోవైపు సిద్ధరామయ్య లింగాయత్‌‌లను ప్రత్యేక మతంగా గుర్తించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని చెబుతున్నారు. తొలుత మతం అంశంపై కాంగ్రెస్‌‌కు అనుకూలంగా కనిపించినా, ఈ విషయంలో ఇప్పుడు ఎదురుగాలి వీస్తోందని అంటున్నారు.