జనాభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక!

15 March, 2019 - 12:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకే రాగ ద్వేషాలకు అతీతంగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్‌‌లో సార్వత్రిక ఎన్నికలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థుల్ని ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి అని చంద్రబాబు అభివర్ణించారు. సుదీర్ఘ కసరత్తు చేసి, గెలుపు గుర్రాలను ఎంపిక చేశామన్నారు. టికెట్‌ రాని వారు నిరాశ చెంద వద్దని, అందరి సేవలూ గుర్తించి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని భరోసా ఇచ్చారు. వచ్చే రోజుల్లో తగిన ప్రాధాన్యం అందరికీ కల్పించే బాధ్యత తనదని చంద్రబాబు తెలిపారు. అమరావతి నుంచి శుక్రవారంనాడు టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మాట్లాడుతూ.. అభ్యర్థులందరినీ కార్యకర్తలు ఆశీర్వదించాలని సూచించారు. కార్యకర్తలను కలుపుకోకుండా వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని నేతలను హెచ్చరించారు. ఇప్పుడు జరిగేవి ప్రజా ఎన్నికలని, వారి మనోభావాలకు తగ్గట్టుగానే అభ్యర్థులను ఖరారు చేశామన్నారు.

కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో పాటు, ఎవరూ చేయలేని అభివృద్ధి చేశామని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. 37 ఏళ్ల చరిత్ర గల టీడీపీ 22 ఏళ్లు అధికారంలో ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అధికారానికి దూరంగా ఉన్న పదేళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ సారి మరో పార్టీకి ఓటేసి తప్పు చేయొద్దనీ, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.