కిమ్‌కు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇస్తా!

08 June, 2018 - 4:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోపారి సంచలన వ్యాఖ్య చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో సింగపూర్‌లో జరిగే సమావేశం ఫలవంతమైతే…, చర్చలు సజావుగా జరిగితే.. కిమ్‌ను అమెరికాకు ఆహ్వానిస్తానని చెప్పారు. వైట్‌హౌస్‌లో కిమ్‌కు ఆతిథ్యం కూడా ఇస్తానని అనడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

జూన్‌ 12 ఉదయం 9 గంటలకు (సింగపూర్‌ కాలమానం ప్రకారం) ట్రంప్‌, కిమ్‌ల సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. కిమ్‌ జాంగ్‌‌‌ను వైట్‌‌హౌస్‌‌కు లేదా మార్‌-ఎ-లోగా రిసార్టుకు ఆహ్వానిస్తారా? అని మీడియా ప్రతినిధులు ట్రంప్‌‌ను ప్రశ్నించినప్పుడు.. సింగపూర్‌ భేటీ సఫలమైతే కిమ్‌‌ను వైట్‌‌హౌస్‌‌కే ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు.

గడచిన వారంలో కిమ్ జాంగ్‌ ఉన్ తమ దేశ ప్రతినిధి ద్వారా ట్రంప్‌‌కు ఓ లేఖ పంపించారు. దాని గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు.. ‘ఆ లేఖ కేవలం ఒక గ్రీటింగ్‌ మాత్రమే. అది చాలా బాగుంది. బహుశా దాన్ని బహిర్గతం చేసేందుకు నాకు అనుమతి లభించవచ్చు. నిజంగా అది చాలా చక్కని లేఖ. నేను దాన్ని ప్రశంసిస్తున్నాను’ అని ట్రంప్ అన్నారు.

‘సింగపూర్‌ సమావేశం కోసం ఎదురుచూస్తున్నా.. ఈ సమావేశంతో అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తున్నానసని ట్రంప్‌ పేర్కొన్నారు. ఒకవేళ కిమ్‌తో సమావేశంలో ఏదైనా సమస్య వస్తే.. తన అంచనాలు చేరుకోకపోతే సమావేశం నుంచి లేచి వెళ్లిపోతానని ట్రంప్‌ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని ట్రంప్ మరోసారి స్పష్టంచేశారు. అయితే అంత అవసరం రాకపోవచ్చని అనుకుంటున్నానని అన్నారు.

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన దేశ ప్రజల కోసం ఏదైనా గొప్పగా చేయాలని అనుకుంటున్నారని తాను నమ్ముతున్నానని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.