బాబు రాకపోతే.. అరెస్ట్ చేసి తెస్తాం

14 September, 2018 - 2:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నాందేడ్ (మహారాష్ట్ర): బాబ్లీ ప్రాజెక్టు వద్ద 2010లో జరిగిన ఘర్షణలపై ఎనిమిదేళ్ల నుంచి విచారించలేదంటూ వస్తున్న ఆరోపణలపై నాందేడ్ ఎస్పీ కతార్ స్పందించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ధర్మాబాద్ కోర్టులో విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కేసుకు సంబంధించి ఐదేళ్లకు పూర్వమే తాము చార్జిషీట్ దాఖలు చేశామని, ఆ ప్రతులను నిందితులుగా పేర్కొన్న అందరికీ పంపించామని కతార్ స్పష్టం చేశారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నారన్న ఆరోపణలు వారిపై నమోదయ్యాయని, అప్పటి వీడియోలు, ఫొటోలు సాక్ష్యాలుగా ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. 16 మందిపై చార్జ్ షీట్ దాఖలైందని, కేసులో అభియోగాలు నమోదు చేశాక, విచారణ ఆసాంతం కోర్టు పరిధిలోనే ఉంటుందని గుర్తు చేశారు.నిందితులను విచారణకు ఎప్పుడు పిలవాలనే విషయాన్ని కోర్టు చూసుకుంటుందని, నిందితులు రాకపోతే కోర్టు నుంచి ఆదేశాలు అందిన తరువాత తాము అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు సహా 16 మంది నిందితులకు ఈ నెల 21వ తేదీలోగా కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు నుంచి తమకు ఆదేశాలు అందాయని, ఆప్పటి లోగా నిందితులు వచ్చి హాజరవుతారనే భావిస్తున్నామని తెలిపారు.

నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం కోర్టు విచక్షణాధికారమని అభివర్ణించిన నాందేడ్ ఎస్పీ.. చంద్రబాబు సహా ఇతర నిందితులు కోర్టుకు రాకపోతే న్యాయ నిపుణుల సలహా తీసుకుని, వారిని అరెస్ట్ చేసి తరలిస్తామని చెప్పారు.