పవన్‌కు ముందే భద్రత ఇచ్చి ఉంటే..

25 May, 2018 - 4:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ పోరాట యాత్రకు బందోబస్తు కల్పించడంపై టీడీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం పలు అనుమానాలకు తావిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభ అనంతరం పవన్‌‌కు ప్రభుత్వం భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. అయితే తాను ఏమి చేయబోతోంది.. ఎక్కడికి వెళ్తున్నదీ పక్కా సమాచారం ముందుగా టీడీపీ ప్రభుత్వానికీ క్షణాల్లో తెలిసిపోతోంది. దీంతో దానికి అనుగుణంగానే టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అంతా చకచకా జరిగిపోయింది. ఈ విషయాన్ని పసిగట్టిన పవన్.. తనకు కేటాయించిన గన్‌‌మెన్లకు వెనక్కి తిప్పి ప్రభుత్వానికి పంపేశారు.

ఈ అంశాన్ని ఓ సారి జాగ్రత్తగా పరిశీలిస్తే.. పవన్ కల్యాణ్ విజయవాడలో వామపక్షాలతో కలిసి పాదయాత్ర చేయనున్నారనే విషయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు తెలిసిపోయింది. అంతే రాత్రికీ రాత్రే ఆయనతో పాటు ఆయన తనయుడు లోకేష్ బాబు, వారి సన్నిహితులు అమరావతిలో సమావేశమై.. పవన్ పాదయాత్రకు దీటుగా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాల్లో సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ విషయం కాస్తా పవన్‌‌కు అర్థం కావడంతో.. తన పార్టీలో తీసుకున్న కీలక నిర్ణయాలు గన్‌‌మెన్ల వల్లే లీక్ అవుతున్నాయని భావించారు. ఆ తక్షణమే పవన్ కల్యాణ్ గన్‌మెన్లను తిప్పి పంపేశారు.

ఆ కారణాన్ని సాకుగా చూపి.. పవన్ ఇటీవల ప్రారంభించిన జనసేన పోరాట యాత్రకు ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేయడం లేదనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వేళ పవన్ సభలకు బందోబస్తు ఏర్పాటు చేసినా.. నలుగుగురైదుగురు పోలీసులను మాత్రమే కనిపిస్తుండడం గమనార్హం. దీంతో పవన్ చేపట్టిన కార్యక్రమాల్లో పలు చోట్ల తోపులాట జరిగినా… పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఆ క్రమంలో పవన్ జనసేన పోరాట యాత్రకు బందోబస్తు కల్పించాలని జనసేన నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పవన్‌‌కి భద్రతగా మేం గన్‌‌మెన్లను పంపితే.. మళ్లీ ఆయన వారిని తిరిగి పంపారు కదా. మళ్లీ ఆయన కార్యక్రమాలకు బందోబస్తు ఎందుకు అనే ప్రశ్న ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి.

మే 20న ప్రారంభించిన పోరాట యాత్రలో భాగంగా పవన్.. నిరసన కవాతులు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు రోజు రోజుకు ప్రజాదరణ పొందుతున్నాయి. ఆ క్రమంలో వేలాదిగా పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌‌పై ఎవరైనా కుట్రకు పాల్పడితే.. పరిస్థితి ఏంటనే విషయం జనసేన పార్టీ నాయకులకు ఆందోళనగా ఉంది.

కాగా.. మే 22న పోరాట యాత్ర ముగించుకుని కాశీబుగ్గలోని కల్యాణ మండపంలో రాత్రికి పవన్ బస చేశారు. ఆ క్రమంలో స్థానిక విద్యుత్ ఉద్యోగులం అంటూ కొందరు అక్కడికీ చేరుకుని గలాటా సృష్టించారు. పవన్ కల్యాణ్ రెస్ట్‌లో ఉన్నారు.. ఉదయాన్నే వస్తే కలుస్తారని ఆయన వ్యక్తితగ రక్షణ సిబ్బంది చెబితే వినలేదు. పైగా పవన్ ఉన్న కల్యాణ మండపానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి.. ఇప్పుడెలా బయటకి రాడో చూస్తామంటూ రుబాబు చేశారు. ఈ క్రమంలో ఆగంతకులకు, పవన్ సిబ్బందికీ మధ్య ఘర్షణకు దారి తీసింది. పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై ఆగంతకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, గాయపడిన పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దీంతో పవన్ పోరాట యాత్రకు రెండు రోజులు బ్రేక్ పడింది. ఈ రెండు రోజుల బ్రేక్‌ రావడం, చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ విధించిన డెడ్‌లైన్ ముగియడంతో ఆయన శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్ర 5 వరకూ నిరాహార దీక్షకు దిగారు.
నిజానికి పవన్ కల్యాణ్ చేపట్టిన పోరాట యాత్రకు ప్రభుత్వం ముందుగానే బందోబస్తు కల్పించి ఉంటే.. యాత్రకు బ్రేక్ పడేది కాదు.. ఆయన ఇంత దూకుడుగా నిరాహార దీక్షకు దిగి ఉండేవారు కాదనే భావన వ్యక్తం అవుతోంది.