వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

10 July, 2019 - 7:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మాంచెస్టర్‌: ఐసీసీ ప్రపంచకప్ 2019 నుంచి టీమిండియా టాపార్డర్‌ కేవలం ఐదు పరుగులకే కుప్పకూలిపోయింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. తొలుత జట్టును కాస్త ఆదుకున్నట్లే కనిపించిన పంత్‌ (32), పాండ్య (32) వెంటవెంటనే ఔటైపోయారు. ఇక ఏమాత్రం ఆశల్లేని మ్యాచ్‌లో టీమిండియా గొప్ప పోరాటమే చేసిందని చెప్పాలి. జడేజా (77- 59 బంతుల్లో 4×4, 4×6), ధోనీ (50- 70బంతుల్లో 1×4, 1×6) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను దాదాపు గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ కీలక సమయంలో వారు కూడా ఔటవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో 18 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరింది. టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో హెన్రీ మూడు, బౌల్ట్‌, శాంట్నర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ ఓటమితో భారత్‌ ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. మరోవైపు ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ రెండోసారి ఫైనల్‌ చేరింది.

అయితే.. కీలక సెమీఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా హాఫ్‌ సెంచరీతో మెరవడం కాస్త ఊరట కలిగించే అంశం. కీలక సమయంలో టీమిండియాకు అవసరమైన దశలో జడేజా తన సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

అంతకు ముందు ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో టీమిండియాకు 240 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్లు నష్టపోయి 239 పరుగులు చేసింది.