దేశంలో దక్షిణాది కూడా ఎంతో ముఖ్యం..!

17 April, 2019 - 4:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వయనాడ్‌ (కేరళ): దేశంలోని ఇతర ప్రాంతాలు ఎంత ముఖ్యమో దక్షిణాది కూడా అంతే ముఖ్యమని చాటి చెప్పేందుకే తాను వయనాడ్‌ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. దక్షిణాది రాష్ట్రం వయనాడ్‌ నుంచి పోటీ చేయడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రధాని మోదీలా తాను అసంబద్ధమైన హామీలు ఇవ్వబోనన్నారు. ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ వయనాడ్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓ రాజకీయ నాయకుడిగా తాను వయనాడ్‌కి రాలేదన్నారు. పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజలకు తాను మద్దతుగా ఉంటానన్నారు. తనను సొంత కొడుకులా, స్నేహితునిగా భావించాలని ఆయన కోరారు. ‘మన్ కీ బాత్’లో మాదిరిగా తాను తన అభిప్రాయాలు చెప్పేందుకు వయనాడ్ రాలేదని.. స్థానిక ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు నేర్చుకోవడానికి వచ్చానన్నారు. జీవితాంతం ఇక్కడి ప్రజలతోనే ఉంటానని హామీ ఇచ్చారు. ప్రకృతిని, అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆరెస్సెస్‌‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. దేశం మొత్తానికి ఒకే సిద్ధాంతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.అంతకు ముందు.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీతో రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేతలు దేశాన్ని విభజించి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలకు మోదీ పాలనే కారణమన్నారు. వారు అనుసరిస్తున్న విధానాలతో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొందన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వయనాడ్‌‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరునెల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో భాగంగా ఏప్రిల్‌ 23న కేరళలోని 20 లోక్‌‌సభా స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.