ఆసీస్ సీరీస్ నెగ్గాక కోహ్లీ రియాక్షన్

07 January, 2019 - 3:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సిడ్నీ: ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్టు సీరీస్‌‌ను గెలుచుకోవడంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. ఇదొక మధురమైన జ్ఞాపకం అని కోహ్లీ పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లోనూ తమ జట్టు సమష్టిగా రాణించడం వల్లే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు‌ను వారి దేశంలో ఓడించడం సాధ్యమైందన్నాడు. నాలుగు టెస్టుల సీరీస్‌‌లో భాగంగా చివరిది, సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో కోహ్లీ సేన సీరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మా జట్టును చూసి చాలా గర్వంగా ఉంది. ఈ సీరీస్‌ సాధించడం నిజంగా చాలా గొప్పగా ఫీల్‌ అవుతున్నా. గత 12 నెలల నుంచి మా జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తూ చక‍్కని పునాది వేసుకుంది. ఏడాది కాలంగా జట్టులో వచ్చిన సమతుల్యత కారణంగానే ఆసీస్‌‌ను వారి గడ్డపై ఓడించాం. అంతకు ముందు జరిగిన రెండు విదేశీ పర‍్యటనల్లో కూడా మా జట్టు సత్తా చాటింది. భారత క్రికెట్‌ జట్టు ఈ స్థాయి ప్రదర్శనను నేను ఎప్పుడూ చూడలేదు. నలుగురు పేసర్లతో విదేశీ పర్యటనకు వెళ్లడం కూడా నా అనుభవంలో ఏనాడూ జరగలేదు. ఇది జట్టు సభ్యులందరూ సాధించిన అద్భుతమైన ఘనత. ప్రధానంగా ఫిట్‌‌నెస్‌ స్థాయిని కాపాడుకోవడం వల్లే ఆసీస్‌‌లో విజయాలు సాధించాం. దీనికి జట్టు సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హ్యాట్సాఫ్‌ టు టీమ్‌ మెంబర్స్‌. భారత క్రికెట్‌‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే మా ముందున్న లక్ష్యం’ అని కోహ్లీ అన్నాడు.

భారత జట్టు కెప్టెన్‌‌‌గా ఈ చారిత్రక సీరీస్‌ గెలిచిన సందర్భాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని కోహ్లీ అన్నాడు. ఏ వ్యూహంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లామో దాన్ని కచ్చితంగా అమలు చేసి సక‍్సెస్‌ అయ్యామన్నాడు. ప్రధానంగా తమ బ్యాటింగ్ విభాగానికి బౌలర్ల జోష్‌ కూడా తోడవడంతో విజయం సునాయాసమైందన్నాడు. ప్రతీ ఒక బౌలర్‌ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదని కోహ్లీ ప్రశంసించాడు.