రాయదుర్గం వరకు మెట్రో..అమీర్‌పేట-హైటెక్‌సిటీ పనుల్లో వేగం

08 December, 2017 - 9:15 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: భాగ్యనరగ వాసులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమీర్‌పేట్‌–మియాపూర్‌(13 కిలోమీటర్లు), నాగోలు–అమీర్‌పేట్‌(17 కిలోమీటర్లు) రూట్లలో ప్రస్తుతం ఒక్కో మార్గంలో ఏడు చొప్పున మొత్తం 14 రైళ్లు తిరుగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర మార్గాల్లో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు కేంద్రమైన హైటెక్ సిటీ ప్రాంతంలో మెట్రో పనుల్లో వేగం పెంచారు. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మెట్రో మార్గాన్ని జూన్‌1 నాటికి పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు ఉన్న 8.5 కి.మీ. మార్గాన్ని జూన్‌కల్లా పూర్తిచేయడమే కాదు రాయదుర్గం వరకు మెట్రోను పొడిగించారు. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గాన్ని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. రాయదుర్గం టర్మినల్‌ స్టేషన్‌ కోసం ఎక్కడ స్తంభాలు నిర్మించాలనే దానిపై ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌ను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, ఎల్‌ అండ్‌ టీ మెట్రో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం.పి.నాయుడు, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లతో కలిసి తుది నిర్ణయం తీసుకున్నారు.

నిర్మాణ సమయం, ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏ తరహా స్తంభాలు వేయాలో నిర్ణయించారు. మొత్తం 49 స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు పొడిగించిన కిలోమీటరున్నర మెట్రో మార్గాన్ని మూడేళ్లలో కాకుండా రెండేళ్లలో పూర్తిచేయాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రోకి ఎన్వీఎస్‌రెడ్డి సూచించారు. హైటెక్‌సిటీ ఫ్లైఓవర్‌ మీదుగా శిల్పారామం వైపు కాకుండా సీఎం సూచన మేరకు సైబర్‌ టవర్స్‌ పక్క నుంచి వయాడక్ట్‌ నిర్మించాలని, ఈ మేరక్‌ రీ డిజైన్‌ చేయాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రోకి సూచించారు. అదే సమయంలో ట్రాఫిక్‌ సులువుగా వెళ్లేలా చూడాలన్నారు.

మరోవైపు భాగ్యనగర వాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగరవాసులు ఉత్సాహం చూపుతున్నారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణిస్తున్న వారి సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా. తాజాగా హైటెక్ సిటి మార్గంలో మెట్రో అందుబాటులోకి వస్తే.. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే. మరోవైపు మెట్రో రైలు సౌకర్యాన్ని భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు తెలంగాణ యోచిస్తోంది. రెండో దశలో మెట్రో రైలు మార్గాన్ని మరో 80 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది.