బూతుల్లోకి ‘సెల్’ వద్దు

06 December, 2018 - 3:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. గురువారం పోలిస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అంజనీ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ బూతుల్లోకి సెల్ ఫోన్లు అనుమతి లేదన్నారు.

హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాలకు ఏసీపీ ర్యాంకు స్థాయి పోలీస్ అధికారులను నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో 3,911 పోలింగ్ కేంద్రాలు, 1,574 పోలింగ్ లోకేషన్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

అలాగే 60 షాడో టీమ్‌లను కూడా నియమించామని వివరించారు. ఇప్పటి వరకు రూ. 27 03, 76000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే రూ. 2.41 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నామని… రూ. 2 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నామని అంజనీకుమార్ వివరించారు.

అదేవిధంగా 518 చెక్ పోస్టులను శుక్రవారం ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో 161 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని.. ఆయా ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాలను మోహరిస్తున్నట్లు అంజనీకుమార్ వివరించారు.