ఈసారి హంగ్ తప్పదా?

30 November, 2018 - 7:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి… కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం… ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం… పార్టీలు రంగంలోకి దిగి పోటీ చేయడం … సీట్లు కేటాయింపు… అభ్యర్థుల ఎంపిక…. నామినేషన్లు వేయడం….నామినేషన్లు ఊపసంహరణ గడువు ముగియడంతో.. ప్రచార హోరు మొదలైంది.

టీఆర్ఎస్ ఓ వైపు… తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జన సమితి, సీపీఐ ప్రజాకూటమిగా అవతరించాయి. అలాగే బీజేపీ మరో వైపు ప్రచార తీవ్రతను మరింత పెంచాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు పరిణామాలు జెట్ స్పీడ్ వేగంతో మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఈ ఎన్నికల్లో కారు పార్టీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని అంతా భావించారు.

కానీ ప్రచార రంగంలోకి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన ఫ్యామిలీ అంతా ర్యాలీలు రోడ్డు షోలు, మైనార్టీలతో మీటింగులు ఏర్పాటు చేసుకుని మరీ.. మీకు మేమున్నాంటూ భరోసా ఇస్తున్నారు.

అయితే ఏ నాయకుడు సభ పెట్టినా …. జనం మాత్రం ప్రభంజనంలా తరలి వస్తున్నారు. అలాగే ఏ పార్టీ నాయకుడైనా.. ఆయన చెప్పే ప్రతి అంశాన్ని ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఆగస్టు నాటి రాజకీయ వాతావరణానికీ నేటి పరిస్థితులకీ చాలా తేడా ఉందని చెబుతున్నారు. ఈ అయిదునెలల్లోనే అంతా తారుమారు అయిపోయిందంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కచ్చితమైన మెజార్టీ రాదని వారు పేర్కొంటున్నారు.

ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల చాలా వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలోకి దిగితే… ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. అలాగే బీజేపీ పట్ల కూడా వ్యతిరేకత ఉందన్న మాట వాస్తవమే. ఇక మహాకూటమికి పరిస్థితి ఎంతో మెరుగుపడిందని పరిశీలకుల అంచనా.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేసిన ప్రొ కోదండరామ్, గద్దర్‌, విమలక్క వంటివారితో పాటు దళితనేత మంద కృష్ణ మాదిగ వంటి ప్రజా ఉద్యమ నేతలు ప్రజాకూటమికి మద్దతు పలకడంతో కాంగ్రెస్ కూటమి బలోపేతమైంది. ఈ నేపథ్యంలో మహాకూటమి టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నట్లు స్పష్టమైపోయింది. టీఆర్ఎస్ కూడా ప్రచారానికి సంబంధించినంత వరకు ముందంజలోనే ఉంది. ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఇరు పక్షాలూ హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ పక్షానికీ మెజారిటీ రాకపోవచ్చునన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్.. తిరుమలలో శ్రీవారిని సందర్శించుకున్న అనంతరం ఆనంద నిలయం సాక్షిగా… తెలంగాణ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారంటూ ప్రకటించారు. అంతేకాదు.. అలా గెలిచే వారిలో ఇద్దరి పేర్లను కూడా ఆయన వెల్లడించారు. అలాగే రోజుకు ఇద్దరు పేర్లు ప్రకటిస్తానంటూ ఆయన ప్రకటించారు.

లగడపాటి సర్వే అంటే అంతా పర్ ఫెక్ట్ గా ఉంటుందన్నది తెలిసిన విషయమే. దీంతో ఏ పార్టీకి మెజార్టీ రాదని .. ఓ వేళ వచ్చినా…. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి వారు.. ఈ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దాంతో ఈ సారి తెలంగాణలో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.