వైజాగ్‌లో లక్ష్మీనారాయణకు లక్కెంత?

12 April, 2019 - 2:09 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

విశాఖపట్నం: విశాఖ పార్లమెంటరీ స్థానంలో ఈసారి పాగా ఎవరు వేస్తారు? లోక్‌‌సభకు వెళ్లే వైజాగ్ ప్రతినిధి ఎవరు? గురువారం సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌ ముగిసినప్పటి నుంచీ విశాఖనగర వాసుల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖ ఓటర్లు ఈసారి ఎవరిని పార్లమెంటుకు పంపిస్తారనేది ఆసక్తిగా మారింది. విశాఖ లోక్‌‌సభా స్థానం విషయంలో పార్టీలకు అతీతంగా జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ విషయంలో చర్చ జరుగుతోంది.

నిజానికి ఈసారి ఉత్తరాంధ్రలో అందరి దృష్టీ విశాఖ పార్లమెంటరీ స్థానంపై కేంద్రీకృతమైందనే చెప్పాలి. ఎందుకంటే విశాఖ పార్లమెంటరీ స్థానం పరిధిలోని గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ బరిలో దిగం, ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ రంగంలో ఉండడమే. విశాఖ లోక్‌‌సభా స్థానం పరిధిలో పెద్ద ఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు పోలింగ్‌ సరళి వెల్లడిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా క్రాస్ ఓటింగ్ జరగడం జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ జరిగింది. బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి ఒక్కరే రాజకీయాలకు పాతవారు. మిగతా టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన అభ్యర్థులు ముగ్గురూ రాజకీయాలకు కొత్తే. కానీ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ పార్టీ ఇమేజ్‌ కంటే తన వ్యక్తిగత గుర్తింపుతో విశాఖ వాసుల్ని ఎక్కువగా ఆకట్టుకున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. గాలి జనార్దన్‌‌రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి కేసుల్ని ధైర్యంగా దర్యాప్తు చేశారనే ముద్ర లక్ష్మీనారాయణకు బాగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ చరిష్మా లక్ష్మీనారాయణకు ఈ ఎన్నికల్లో బాగా ఉపయోగపడిందంటున్నారు.

ఒక పక్కన స్థానికుడు కాదనే వ్యతిరేక ప్రచారం లక్ష్మీనారాయణకు ఎదురైనా.. తాను నగరాన్ని వదిలి వెళ్లనని, విశాఖలోనే ఇల్లు తీసుకున్నానని ఆయన కచ్చితంగా చెప్పడం ఓటర్లను ఆకట్టుకుందనే అభిప్రాయం వస్తోంది. ఎన్నిక సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తనపై కేసులు వేసుకోవచ్చంటూ బాండ్‌ పేపర్‌‌పై హామీలు రాసి, ఆ బాండ్‌ను సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉంచడం కూడా ఆయన పట్ల ఓటర్లలో నమ్మకం కుదిరిందని తెలుస్తోంది. లక్ష్మీనారాయణ విద్యావంతుడు, నిజాయతీపరుడు అనే పేరు ఉండడం కొన్నివర్గాల వారిని విశేషంగా ఆకర్షించిందంటున్నారు. ఒక పక్కన జనసేన పార్టీ పట్ల యువతలో ప్రత్యేక ఆకర్షణ ఉంది. దానికి తోడు లక్ష్మీనారాయణ వ్యక్తిగత ఇమేజ్ మరింతగా కలిసివచ్చే అంశంగా విశ్లేషణలు వస్తుండడం గమనార్హం.
లక్ష్మీనారాయణ వ్యక్తిగత ఇమేజ్‌ కొంత అడ్వాంటేజ్ అయ్యిందని, దాంతో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని చెబుతున్నారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు వస్తున్నా కూడా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, ఇది లక్ష్మీనారాయణకు లాభిస్తుందని చెబుతున్న వారే ఎక్కువగా ఉండడం విశేషం.విశాఖలో స్థానికేతర ఓటర్లు గణనీయంగా ఉన్నారు. భారీ పరిశ్రమలు, సంస్థలున్న వైజాగ్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలూ నివసిస్తున్నారు. ప్రచారం సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వీలైనంత వరకు అక్కడివారి భాషలో మాట్లాడి లక్ష్మీనారాయణ ఓట్లను అభ్యర్థించడం వారిని ఆకర్షించిందని చెబుతున్నారు. ఇలాంటి పలు అంశాలు క్రాస్‌ ఓటింగ్‌‌కు కారణమయ్యాయనే అభిప్రాయం రూఢిగా వ్యక్తం అవుతోంది. పార్టీ అభిమానులు కూడా అసెంబ్లీ విషయంలో తమ అభిమాన పార్టీ అభ్యర్థికి ఓలు వేసినా.. ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి లక్ష్మీనారాయణ పట్ల మొగ్గుచూపారనే అభిప్రాయం వస్తోంది.

ఇలా ఉండగా.. ఇదంతా విశాఖ నగరం పరిధిలోని వాతావరణమే తప్ప గ్రామీణ ఓటర్లకు లక్ష్మీనారాయణ అంతగా తెలియదని, అక్కడి ఓటర్లకు ఆయన పట్ల అంతగా సానుకూలత ఉండక పోవచ్చనే అభిప్రాయం కూడా మరోపక్కన వస్తోంది. ముఖ్యంగా విశాఖ లోక్‌‌సభ స్థానం పరిధిలోకి వచ్చే ఎస్‌.కోట, భీమిలి నియోజకవర్గాల్లోని గ్రామీణులు, నగరంలోని మురికివాడల ప్రజలు లక్ష్మీనారాయణకు ఓట్లు వేసే అవకాశం లేదని అభిప్రాయమూ కొందరు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇలా కొంత భిన్నాభిప్రాయా ఉన్నా భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, ఇది లక్ష్మీనారాయణకు కలిసి వస్తుందని చెబుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం. ఇదే నిజమైతే లక్ష్మీనారాయణ పార్లమెంట్‌లో అడుగు పెట్టడం ఖాయం అని చెప్పొచ్చు.