ప్రతినిధుల సభలో ‘గ్రీన్‌కార్డు’ బిల్లు పాస్..!

12 July, 2019 - 7:04 AM

(న్యూవేవ్స్ డెస్క్)

వాషింగ్టన్‌: భారతదేశానికి చెందిన ఐటీ నిపుణులకు ఎంతో ప్రయోజనం కలిగించే ‘గ్రీన్‌కార్డు’ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) భారీ ఆధిక్యంతో ఆమోదించింది. అమెరికాలో శాశ్వత నివాసం, ఉద్యోగ వసతికి అనుమతించే గ్రీన్‌కార్డుల మంజూరుపై ఉన్న 7 శాతం పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు (ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై-స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ చట్టం 2019 లేదా హెచ్‌ఆర్‌ 1044) 365- 65 ఓట్లతో సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టం అయితే.. భారత్‌, చైనా తదితర దేశాలకు చెందిన ఐటీ, వృత్తి నిపుణులు ఎంతోకాలంగా గ్రీన్‌కార్డుల కోసం చేస్తున్న నిరీక్షణకు తెరపడుతుంది.

ఈ తాజా బిల్లు అమెరికాకు ఉద్యోగాల కోసం వచ్చేవారిపై ‘దేశానికి ఇంత కోటా (7 శాతం)’ అనే పరిమితిని ఎత్తివేయడం, కుటుంబాలు ఇతర అవసరాలతో వచ్చేవారికి సంబంధించి ఈ కోటా (7 నుంచి 15 శాతానికి)ను పెంచడానికి ఉద్దేశించింది. ఈ బిల్లు చట్టబద్ధమైతే.. ఉద్యోగ ఆధారిత వీసాల్లో కొన్ని నిబంధనలు కూడా మారనున్నాయి. ఈబీ-2, ఈబీ-3, ఈబీ-5 వీసాలకు కూడా కొంత శాతం కోటా కల్పిస్తారు.

అమెరికా ప్రతినిధుల సభలో సభ్యుడు జాన్‌ కర్టిస్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లు అమల్లోకి వస్తే ‘ముందు వచ్చేవారికి ముందు’ విధానం ఉంటుందని, ఉద్యోగులు వారి కుటుంబాలకు, అమెరికాలో పెట్టే కంపెనీలకు ఉపయోగకరంగా నిలుస్తుందని అన్నారు. ఎవరైనా ఏ దేశంలో పుట్టారన్న విషయంతో సంబంధం లేకుండా.. వస్తు, సేవల నిపుణులను నియమించుకోవడానికి, ఉద్యోగాలు కల్పించడానికి వీలు పడుతుందని వివరించారు.

భారతీయ ఐటీ నిపుణులు తదితరులు హెచ్‌-1బీ వర్క్‌ వీసాలపై అమెరికా వస్తుంటారు. ప్రస్తుత విధానంలో చట్టప్రకారం శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందడానికి 7 శాతం మాత్రమే పరిమితి ఉండటంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానంలో గ్రీన్‌కార్డుల కోసం పలువురు భారతీయ హెచ్‌-1బీ వీసాదారుల నిరీక్షణ కాలం 70 ఏళ్లకు పైగా కూడా పట్టే అవకాశం ఉంటుందని ఇటీవల కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి వృత్తి నిపుణులు గ్రీన్‌కార్డుల కోసం చేయాల్సిన నిరీక్షణకు తాజా బిల్లుతో తెరపడుతుందనే ఆనందం పలువురు వృత్తి నిపుణుల్లో వ్యక్తం అవుతోంది. అమెరికా వ్యాప్తంగా.. ప్రత్యేకించి కాలిఫోర్నియాలోని సిలికాన్‌ వ్యాలీ, వాషింగ్టన్‌ స్టేట్‌లోని సియాటెల్‌, గ్రేటర్‌ వాషింగ్టన్‌ డీసీ. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌ తదితర ప్రాంతాల్లోని భారతీయ వృత్తినిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగ్రశ్రేణి అమెరికన్‌ ఐటీ కంపెనీలు కూడా ఈ బిల్లును స్వాగతించాయి. సెనేట్‌ కూడా త్వరలోనే దీన్ని ఆమోదించాలని కోరాయి.

అయితే.. ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదముద్ర పడి, చట్టం కావడానికి ముందు అధికార రిపబ్లికన్‌ పార్టీకి ఆధిక్యం ఉన్న సెనేట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమలా హారిస్‌ సహా పలువురు సెనేటర్లతో కూడిన ఓ గ్రూపు మద్దతిస్తున్న ఇదే తరహా బిల్లు ఒకటి కూడా త్వరలోనే సెనేట్‌ ముందుకు రానుంది.

గ్రీన్ కార్డు మంజూరు కోసం అన్ని దేశాల వారినీ ఒకేలా చూసే విధానానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించడాన్ని ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ స్వాగతించారు. వాణిజ్యానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చేలా అత్యంత నైపుణ్య వలస విధానాన్ని ఈ బిల్లు ప్రోత్సహిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.