17 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

12 January, 2018 - 8:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల పెరుగుదలతో రిటైల్‌ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ట స్థాయి 5.2 శాతానికి ఎగబాకింది. ప్రభుత్వ శుక్రవారం ఇచ్చిన అధికారిక డేటా ఈ విషయం తేటతెల్లం చేస్తోంది. గత మూడు నెలలుగా వరుసగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. గత ఏడాది అక్టోబర్ ఒక్క నెలలోనే రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 4.88 శాతంగా నమోదైంది.

కొండెక్కి కూర్చున్న ధరల కారణంగా పండగ వేళ దేశంలోని సామాన్య వినియోగదారుడే కాదు ఎవ్వరు ఏ వస్తువు కొనాలన్నా మీనమీషాలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్‌‌బీఐ అంచనాలను మించి ద్రవ్యోల్బణం పరుగులు పెడుతుండటంతో వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.నిత్యావసర వస్తువుల ధరల భారం సామాన్యులకు ఊపిరాడనివ్వకుండా చేస్తుండగా.. గడచిన ఏడాది నవంబర్‌‌లో పారిశ్రామిక ఉత్పత్తి 2.2 శాతం నుంచి ఏకంగా 8.4 శాతానికి పెరగడం కొంత ఊరట ఇస్తోందనే చెప్పాలి. పారిశ్రామిక ఉత్పాదకత 4 శాతంగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ భారీగా పెరగడం విశేషం. తయారీ రంగం కూడా 10 శాతం పైగా వృద్ధిని నమోదు చేయడం ఆనందాన్నిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.