హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు ఎదురుదెబ్బ

12 June, 2018 - 2:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌‌కు హైకోర్టులో మంగళవారం గట్టి ఎదురుదెబ్బే తగిలింది. వివేక్ ఎన్నిక చెల్లదంటూ ఇంతకు ముందు అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసింది. తాజాగా పునర్విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. అప్పటి వరకు వివేక్‌ హెచ్‌‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగ రాదని తీర్పునిచ్చింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో వివేక్ మరోసారి పదవి కోల్పోవాల్సి వస్తుంది.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్‌ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌‌మన్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్‌ స్థాయి ఉన్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ జి.వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సింగిల్‌ బెంచ్‌ అప్పట్లో స్టే విధించింది. తాజాగా హైకోర్టు.. అంబుడ్స్‌మన్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.

తీర్పును స్వాగతించిన అజారుద్దీన్‌:
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ తెలిపారు. వివేక్‌ ప్యానల్‌ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. వివేక్‌పై అంబుడ్స్‌మన్‌ తీసుకున్న నిర్ణయమే నిజమైందన్నారు. తొలి నుంచీ తాము వివేక్‌ ప్యానల్‌‌పై పోరాటం చేస్తున్నామని, చివరకు హెచ్‌‌సీఏలో న్యాయమే గెలిచిందని తెలిపారు. హెచ్‌‌సీఏలో ఏం జరగాలనే దానిపై జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహిస్తారన్నారు.

హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా అజారుద్దీన్‌పై వివేక్ గెలిచారు. అయితే వివేక్ ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ హెచ్‌సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు, చట్టానికి విరుద్ధం అటూ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌‌కు ఫిర్యాదు చేశారు.