కేరళ తీరంలో హై అలర్ట్

27 May, 2019 - 1:26 AM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరువనంతపురం: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో కేరళలోని సముద్ర తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. తీరం వెంబడి ఉన్న అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లలో అప్రమత్తంగా హెచ్చరించడమే కాకుండా తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు కొత్త అడ్డాగా మారిన శ్రీలంక నుంచి 15 మంది ఉగ్రవాదులు లక్షద్వీప్ బయల్దేరినట్టు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేరళ తీరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. టెర్రరిస్టులు కొన్ని పడవల్లో అరేబియా సముద్రంలో ప్రవేశించి లక్షద్వీప్ దిశగా వెళుతున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది అత్యంత కచ్చితత్వంతో కూడిన సమాచారం అంటూ కేరళ తీరంలోని అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. దీంతో భారతదేశంలో మరోసారి ఉగ్రకలకలం రేగినట్లయింది.
లక్షద్వీప్‌లో అడుగుపెట్టడం ద్వారా, అక్కడ్నించి ఇతర మార్గాల్లో భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాలన్నది ఉగ్రవాదుల ప్రణాళిక అని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. కేరళ తీరం వెంబడి భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పదంగా కనిపించే పడవలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సందేహాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అందాయని తెలుస్తోంది.