తోడల్లుళ్లకు తోడు దొరికారు

11 July, 2018 - 5:23 PM

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్ వరుణ్‌‌తేజ్‌ కథానాయకులుగా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్‌ మూవీ ‘f2’. దీనికి ‘ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అనే క్యాప్సన్ పెట్టారు. అనిల్‌ ‌రావిపూడి డైరెక్షన్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. పాటలకు దేవిశ్రీ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్‌‌తేజ్ తోడల్లుళ్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు హీరోలకు హీరోయిన్లుగా ఎవరు సెట్ అవుతారా అని ఫ్యాన్స్ కొన్నాళ్లుగా బుర్రకు పదును పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రేక్షకులను అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకున్నారో ఏమో దర్శక నిర్మాతలే రంగంలోకి దిగారు. తోడల్లుళ్లకు తోడు దొరికారని ప్రకటించారు. ఆ రెండు జంటలూ కలిసి ఉన్న ఫొటో ఒకటి విడుదల చేశారు. ఆ ఫోటోలో వెంకటేష్ పక్కన మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ కనిపించారు. దీంతో అభిమానుల ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పడింది.

ఎఫ్2 సినిమాకు సంబంధించిన ఈ స్టిల్‌ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణం ఈ ఫొటోలో కనిపించటం గమనార్హం. ఈ ఇమేజ్‌ను చూస్తుంటే మూవీని వినోద భరితంగా రూపొందిస్తున్నట్లు అర్థం అవుతోంది.

ఎప్2 మూవీ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. వెంకటేశ్‌ రెండు రోజుల కిందటే సినిమా సెట్‌‌లోకి ఎంటరయ్యారు. వచ్చీ రావటంతోనే లుంగీలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ ఫొటో కూడా చాలా మందిని ఆకట్టుకుంది. ఇళ్లల్లో మగవాళ్లు ఎక్కువగా లుంగీలే వేసుకుంటారు. తమ అభిమాన హీరో వెంకటేశ్ కూడా తమ లాగే ఒక సామాన్యుడిలా లుంగీ వేసుకోవటం యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికీ నచ్చింది.

తాజా పిక్‌లో వెంకీ.. మెడలో టై కట్టుకోవటం కూడా బాగుంది. గతంలో వెంకటేశ్.. టైతో నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. సుందరకాండ, మల్లీశ్వరి, పెళ్లిచేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు వంటి సినిమాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.