‘డ్రీమ్‌గర్ల్’కు తప్పిన పెను ప్రమాదం

14 May, 2018 - 1:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మధుర: బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమామాలిని (డ్రీమ్‌గర్ల్)కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గం మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ఓ సమావేశానికి కాన్వాయ్‌‌లో ఆమె వెళ్తుండగా భారీ ఎత్తున ఈదురుగాలులు వీచాయి. దీంతో ఓ చెట్టు విరిగి హేమామాలిని ప్రయాణిస్తున్న కారు ముందు పడింది. ఒక్క క్షణం ముందు వచ్చినా ఆ చెట్టు ఆమె కారుపై పడి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం తప్పిందని తెలిపారు.

కాగా.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌‌లలో వర్షాల కారణంగా 46 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మరికొన్ని రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.