మేడారానికి హెలికాప్టర్ సేవలు !

03 January, 2018 - 3:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ: మేడారం జాతర…తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే జాతర. దీన్ని చూసేందుకు సంప్రదాయ ఎడ్లబండి కాలం పోయి ఇప్పుడు ఆకాశయానం చేసే రోజులు వచ్చాయి. ఈ నెల 21వ తేదీ నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేడారం జాతరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించామని చెప్పారు. జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కోరామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.

ఈ ఏడాది జాతర కోసం ప్రభుత్వం నుంచి రూ. 80 కోట్లను కేటాయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమ్మక్క – సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా మేడారం జాతరకు ప్రచారం కల్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మేడారంలో ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే సమ్మక్కసారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల నుంచి అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలిరానున్నారు. 2010లోనే టర్బో ఏవియేషన్‌ సంస్థ సింగిల్‌ ఇంజన్‌ హెలికాప్టర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వరంగల్‌లోని మామునూరు నుంచి రూ.6వేలు అప్‌ అండ్‌ డౌన్‌ చార్జీలు తీసుకుని మేడారానికి భక్తులను తరలించారు. పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో నిలిపివేశారు. 2014లో వరంగల్‌, హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తెచ్చినా విజయవంతం కాలేదు. ఈసారి రెండు హెలికాప్టర్ల ద్వారా మేడారానికి భక్తులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

జాతర ప్రాంగణానికి 3 కిలోమీటర్ల దూరంలో పగిడాపూర్‌ వద్ద 30 లక్షలతో రెండు శాశ్వత హెలిప్యాడ్‌ల నిర్మాణం చేపట్టారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలోనూ హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తుంబి ఏవియేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో రెండు హెలికాప్టర్ల ద్వారా పగిడాపూర్‌కు భక్తులను చేరవేస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో మేడారం గద్దెల వద్దకు తీసుకెళ్లి అరగంటలో దర్శనం చేయించి తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు చేరవేస్తారు. హెలికాప్టర్‌లో ఆరుగురికి కూర్చునే చోటు ఉంటుంది. ఒక్కో హెలికాప్టర్‌ రోజుకు పది ట్రిప్పులు తిరిగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.