సొంతూళ్లకు బారులు..టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జాం!

13 January, 2018 - 12:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు పెద్దసంఖ్యలో ప్రజలు వాహనాల్లో బయలుదేరుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై శనివారం వేకువ జామున భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు రెండు కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద పది గేట్లు తెరిచినా వాహనాల రద్దీ తగ్గలేదు.

విజయవాడ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ప్రత్యేకంగా గేట్ల సంఖ్య పెంచి పెద్దగా రద్దీ ఏర్పడకుండా ప్రయత్నించినా… ఈ ఉదయం నుంచి వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. సాధారణ రోజుల్లో రెండు వైపులా ఆరు ద్వారాల చొప్పున తెరచి ఉంచుతారు. కానీ ఇప్పుడు అదనంగా విజయవాడ వైపు మరో నాలుగు తెరచి మొత్తం పది గేట్ల నుంచి వాహనాల్ని వదులుతున్నారు. ఇందులో ఫాస్టాగ్ కోసం గేటు ఒకటి అందుబాటులో ఉంచారు.

మరోవైపు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ ఖాళీ అవుతోంది. పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లన్నీ బుకింగ్ అయ్యాయి. దూర ప్రాంత రెగ్యులర్ రైళ్లలో రెండు నెలల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో పాటు అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేక రైళ్లలో సీట్లు నిండిపోయాయి. వీటిలో చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పరిమితి కూడా దాటిపోయింది. బెర్తు, సీటు దొరక్కపోయినా.. నిల్చొనైనా వెళ్దామనుకున్నా టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి లేదు.