భాగ్యనగరంలో మరోసారి వరుణుడి విజృంభణ

14 September, 2017 - 8:56 AM


(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యయాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షానికి నగరవాసులు నరకం చూశారు. ఉప్పల్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఖైరతాబాద్‌, మైత్రివనం, ఎర్రగడ్డ, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. భారీ వర్షానికి నగరంలోని పలు రోడ్లు వాగుల్లా మారిపోయాయి. నాలాలు పొంగడంతో బస్తీల్లోకి నీళ్లు చేరాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో రాత్రంతా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు చేరడంతో బస్తీ వాసులు నరకం చూశారు.మల్కాజిగిరి, నేరేడ్‌మెడ్, లాలాపేట్ ప్రాంతాల్లో వాన నీటితో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. బండ చెరువు కట్ట తెగడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. ఉప్పల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. షిర్డీ నగర్‌, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, వెంకటేశ్వరనగర్‌లో వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. పటేల్‌ నగర్‌, దుర్గానగర్‌లోని ఇళ్లలోకి మురుగునీరు చేరుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాలనీవాసులు ఇళ్లపైకి ఎక్కి నిలబడుతున్నారు. మురుగు నీటి కారణంగా వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మబ్బులు కమ్మేశాయి. మరికొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు సంబంధిత అధికారుల సమాచారం. ఈ నేపథ్యంలో చెరువులు, నాలాల పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.