మూడు రాష్ట్రాల్లో అకాల వర్ష బీభత్సం

17 April, 2019 - 4:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలు పలువురి ప్రాణాల్ని తీసేశాయి. భారీ ఎత్తున ఆస్తి, పంట నష్టాల్ని అకాల వర్షాలు తెచ్చిపెట్టాయి. భారీవర్షాల ధాటికి వేర్వేరు ప్రాంతాల్లో 35 మంది బలైపోయారు. ఇంకా ఎందరో గాయాలబారిన పడ్డారు. బుధవారం ఉదయం నుంచీ ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎడారి రాష్ట్రం రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్, గుజరాత్‌ చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి.

రాజస్థాన్‌‌లోని చిత్తోర్‌‌గఢ్‌, శ్రీగంగానగర్‌, అజ్మీర్, కోట, పిలానీ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచీ కుంభవృష్టి కురుస్తోంది. వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. దీంతో పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీగంగానగర్, కోట, పిలానీ వంటి ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌‌లలో కూడా ఇలాంటి దుస్థితే కనిపించింది. ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మధ్యప్రదేశ్‌‌లో 16, గుజరాత్‌‌లో 10, రాజస్థాన్‌‌లో తొమ్మిది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా హిమ్మత్‌నగర్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఈ బహిరంగ సభ కోసం చేసిన ఏర్పాట్లన్నీ చిందర వందర అయ్యాయి. బహిరంగ సభ వేదిక కుప్పకూలిపోయింది. ఈదురు గాలులకు టెంట్లు ఎగిరిపోయాయి. కాగా.. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కూడా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో గురువారం రాష్ట్రంలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌‌లలో భారీ వర్షాలు మిగిల్చిన విషాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయా రాష్ట్రాల సీఎంలను ప్రధాని అప్రమత్తం చేశారు. ప్రధాన మంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రజలకు ఆదుకుంటామని అన్నారు. అకాల వర్షంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు.