తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షం

20 July, 2019 - 7:35 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: వచ్చే రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం పశ్చిమ రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించడంతో మొత్తం భారతదేశం అంతా విస్తరించాయని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు:
దేవరకొండ (నల్లగొండ) 7 సెంటీమీటర్లు, కొత్తగూడ (మహబూబాబాద్‌) 6 సెం.మీ., లక్ష్మణ్‌చాంద (నిర్మల్‌) 5 సెం.మీ., మద్దూర్‌ (మహబూబ్‌నగర్‌) 5 సెం.మీ., అల్లాదుర్గ్‌ (మెదక్‌) 4 సెం.మీ., శాయంపేట (వరంగల్‌ రూరల్‌) 4 సెం.మీ., తాండూర్‌ (వికారాబాద్‌) 4 సెం.మీ., మగనూర్‌ (మహబూబ్‌నగర్‌) 3 సెం.మీ., నిడమనూర్‌ (నల్లగొండ) 3 సెం.మీ., ఆత్మకూర్‌ (వరంగల్‌ రూరల్‌) 3 సెం.మీ., కెరమెరి (కొమురం భీం) 3 సెం.మీ., మునిపల్లి (సంగారెడ్డి) 3 సెం.మీ., పోచంపల్లి 3 సెం.మీ., బూర్గంపాడు 3 సెం.మీ., భద్రాచలంలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.