తెలంగాణకు భారీ వర్ష సూచన

18 July, 2019 - 9:10 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: అరేబియా సముద్రంలో రుతుపవన కరెంట్ ప్రభావంతో పడమర గాలులు వీస్తున్నాయి. దీంతో బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా వచ్చే రెండు మూడు రోజుల్లో ఒడిశా తీరంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావం వల్ల గురువారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఫలితంగా భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అలాగే.. ఈ నెల 23 వరకు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకూ 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా, బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనించాల్సిన విషయం.