భాగ్య నగరంలో కుండపోత.. ఏకధాటిగా భారీ వర్షం

03 October, 2017 - 8:59 AM


(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: భాగ్య నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. క్యుములోనింబస్‌ మేఘాలు ఉధృతంగా ఆవరించడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మొదలైన వాన ఉరుములు, మెరుపులతో హోరెత్తింది.  ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. సుమారు పది నుంచి పదమూడు సెంటీమీటర్లమేర కురిసిన వర్షం ధాటికి హైదరాబాదు అతలాకుతలమైంది. ఖైరతాబాద్, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, పాతబస్తీ, బహదూర్‌పుర, చార్మినార్, సైదాబాద్, మలక్‌పేట, నారాయణగూడ, శేరిలింగంపల్లి, చందానగర్‌, కొత్తపేట, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాలలో కుండపోత కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది.గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట.. నాంపల్లి, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, లకడికాపూల్‌, అంబర్‌పేట, బీఎన్‌రెడ్డినగర్‌, నల్లకుంట, విద్యానగర్‌ ఇలా నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. కూకట్‌పల్లి ప్రధాన నాలా పక్కన ఉన్న అనేక కాలనీలు వరదనీటిలో చిక్కుకున్నాయి.  ఎడతెరిపిలేని వర్షం, మోకాల్లోతు నీళ్లు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు నరకం చవిచూశారు. రోడ్ల మీద వరద పోటెత్తింది. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

హైదరాబాద్‌లో ఫ్లడ్ అలర్ట్ ప్రకటించారు. 140 ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. బల్దియా యంత్రాంగం అప్పటికప్పుడు 50 ప్రాంతాల్లో వరద నీటిని మళ్లింపు కార్యక్రమం చేపట్టింది. ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, రాంనగర్ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎవరూ ఉండొద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు కూడా సెలవు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద బాధితులకు వెయ్యి ఆహార పొట్లాలను జీహెచ్‌ఎంసీ సరఫరా చేసింది. మంగళవారం ఉదయం మరో 5వేల ఆహార పొట్లాలు సరఫరా చేయనున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు.

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లోను భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, వికారాబాద్, గద్వాల, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురియటంతో మూసీ ప్రవా హం ఒక్కసారిగా పెరిగింది. మూసీపరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది మంది చనిపోయారు. హైదరాబాద్‌లో ఆరు నెలల పసికందు సహా ముగ్గురు, సంగారెడ్డి జిల్లాలో నలుగురు, నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టు దగ్గర ఒకరు చనిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో ఓ చిన్నారి నీటిలో కొట్టుకుపోయింది.ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా కేరళ వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. ద్రోణి ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి మధ్య తూర్పు బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తాజాగా ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావం కూడా తోడైంది. మరో రెండు రోజులపాటు రాయలసీమ, తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో సోమవారం కురిసిన కుండపోత 2000 సంవత్సరం ఆగస్టు నాటి వర్షాన్ని తలపించింది. అప్పట్లో ఒకే రాత్రి హైదరాబాద్‌లో 22సెంటీమీటర్ల వర్షం కురియటంతో నగరం అతలాకుతలమమైంది. జలదిగ్భంధంలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి పెద్దసంఖ్యలో బోట్లను ఉపయోగించాల్సి వచ్చింది. ఆ తర్వాత అంత భారీస్థాయిలో వానలు కురియటం ఇదే మొదటిసారి.

నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నగర పరిస్థితిపై సోమవారం రాత్రి ఆయన ప్రగతిభవన్‌లో సమీక్షించారు. మంత్రి కేటీఆర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డితో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. లోతట్టుప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా అధికారయంత్రాంగం వెంటనే స్పందించాలని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సీఎం సూచించారు.

వర్షం కురిసిన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టారని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే విద్యుత్‌ శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసిందని, ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలపై చెట్టు కూలి తీగలు తెగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టారని తెలిపారు. నగర మేయర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌రూం ద్వారా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు.  సహాయక చర్యలు కోసం 100 నంబరుకు సైతం ఫోన్‌ చేయవచ్చని మంత్రి కేటీఆర్ సూచించారు.