సీట్లు.. సిగపట్లు..!

18 July, 2019 - 8:23 AM

టు ముద్ర వేసి ప్రజాప్రతినిధుల పేరుతో చట్టసభలకు కొందరిని మనం ఎందుకు పంపిస్తున్నాం?? జనం సమస్యలపై చర్చించి, సరైన పరిష్కారాలు కనుగొంటారనే కదా?? మరిప్పుడు ఏపీ అసెంబ్లీలో జరుగుతున్నదేంటి?? అధికార, విపక్ష సభ్యులు చేస్తున్నదేంటి?? ఓ స్కూలు పిల్లాడికి ఉన్న క్రమశిక్షణ కూడా లేకుండా వారు వ్యవహరిస్తున్న తీరేంటి?? శాసనసభలో ఏ సభ్యుడైనా తనకు నిర్దేశించిన సీట్లో కూర్చోవాలి కదా..? పాఠశాల స్థాయి నుంచే కేటాయించిన సీట్లోనే కూర్చోవడం సర్వసాధారణ విషయం కదా?

మరి.. ఏపీ అసెంబ్లీలో మహా మహా నాయకులు సీట్లు మారిపోయి కూర్చోవడం ఏంటనే ప్రశ్న సామాన్య జనాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోందనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం ఉపనేత కింజరాపు అచ్చెంనాయుడు మరో సభ్యుడి సీట్లో కూర్చోవడం సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడి చర్చకు దారితీయడాన్ని మనం గమనించవచ్చు. తన పార్టీ సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించిన సీట్లో అచ్చెంనాయుడు కూర్చోవడంతో సభలో సిగపట్లకు దారితీయడం ఆశ్చర్యం కాక మరేమిటి? వీళ్ళ తీరు చూస్తే.. ఐదో తరగతి పిల్లాడైనా కిసుక్కున నవ్విపోతాడు. ఒకరికి కేటాయించిన సీట్లో మరొకరు కూర్చోవడమే కాకుండా ఏకంగా అచ్చెంనాయుడు కూర్చున్న బుచ్చయ్య చౌదరి సీటును అచ్చెంనాయుడికే కేటాయించాలంటూ టీడీపీ శాసనసభా పక్ష నేత చంద్రబాబు నాయుడు కోరడం చూస్తే.. మరింత వింతగా అనిపిస్తోంది. చంద్రబాబు తీరు చూస్తే.. తాను ట్రెజరీ బెంచీల్లో ఉన్నప్పుడు ఒక రూలు.. ప్రతిపక్షంలో ఉంటే మరో రూలు అమలు చేయాలన్నది ఆయన భావనగా ఉందనుకోవాలా?ఎందుకంటే.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీనియార్టీ ప్రకారం తమ పార్టీ శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పక్క స్థానాన్ని కేటాయించారు. అయితే.. వైఎస్సార్సీపీ అప్పటి ఉపనాయకుడైన జ్యోతుల నెహ్రూ ఆ స్థానంలో కూర్చుంటే టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పిన విషయం ఇప్పటికింకా పలువురికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తన సీటు పక్కనే ఉపనేత అచ్చెంనాయుడికి కేటాయించాలని కోరారు. రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవం ఉందని చీటికి మాటికి చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇది తగునా అనేది చర్చనీయాంశం కాక మానదు. పైపెచ్చు సీట్ల సర్దుబాటు విషయంలో ప్రతిపక్షమైన తమకు ప్రయారిటీ ఇవ్వాలంటూ ఆయన చెప్పడం విశేషం. మంత్రులకు ఎలాగైతే సీట్ల విషయంలో ప్రాధాన్యం ఇస్తున్నారో.. ప్రతిపక్ష పార్టీ ఉపనాయకుడికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం సాంప్రదాయం అంటూ వల్లెవేశారు. మరి తాము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఉపనాయకుడి విషయంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం చెప్పిన విషయం బాబుగారు యాది మరిచారేమో మరి! లేదా సీట్ల విషయాన్ని కూడా వివాదంగా మార్చడమే ఆయన అభిమతం అనుకోవాలా?అయితే.. చంద్రబాబు డిమాండ్‌ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‌రెడ్డి ఎద్దేవా చేయడం గమనార్హం. అసెంబ్లీ రూల్స్ ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని వివరించారు. సభలో సీనియర్ సభ్యుడు బుచ్చయ్య చౌదరికి ముందు వరుసలో చంద్రబాబు పక్క సీటు కేటాయించినట్లు చెప్పారు. అయితే.. అచ్చెంనాయుడు తన పక్కనే ఉండాలని చంద్రబాబు కోరుకుంటే.. చంద్రబాబు కూడా వెనక సీట్లో కూర్చోవచ్చంటూ సెటైర్ వేశారు. బుచ్చయ్య చౌదరి తనకు కేటాయించిన స్థానంలో కూర్చునేందుకు వచ్చినా ఆ సీట్లో ఉన్న అచ్చెంనాయుడు కనీసం కదలకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.

చంద్రబాబు లేవనెత్తిన అంశంపై పరిశీలన చేసి, తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ తమ్మినేని సీతారాం హామీ ఇవ్వడంతో ఈ సీట్ల సిగపట్లకు తెరపడడం విశేషం.

అయితే.. అంతకు ముందు.. వైఎస్సార్సీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనకు కేటాయించిన సీట్లో కాకుండా మరో స్థానంలో కూర్చోవడంపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేయడం.. కేటాయించిన స్థానంలోకి వెళ్ళి కూర్చోవాలంటూ శ్రీధర్‌రెడ్డిని ఆదేశించిన నేపథ్యంలో సభలో ఈ సీట్ల సిగపట్ల వ్యవహారం తెర మీదకి రావడం గమనార్హం.

డి.వి.రాధాకృష్ణ
సీనియర్ జర్నలిస్టు