‘అందుకే అజర్‌ను అనుమతించలేదు’

09 January, 2018 - 5:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సమావేశానికి అనుమతించకపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం సమావేశమైన అంబుడ్స్‌మెన్ కమిటీ సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షులు వివేక్‌తో పాటు అంబుడ్స్‌మెన్ నర్సింహారెడ్డి, కార్యదర్శి శేషునారాయణ్ పాల్గొన్నారు. ఆదివారం జరిగిన సమావేశానికి అజర్‌ను అనుమతించకపోవడంపై వివేక్ వివరణ ఇచ్చారు.

‘నేషనల్‌ క్రికెట్‌ క్లబ్‌ కార్డు చూపించమని అడిగితే అజర్‌ చూపించలేదు. ఆయన ఉపాధ్యక్షుడు అయినట్లు కనీసం రికార్డుల్లో కూడా లేదు. అందుకే అతన్ని హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించలేదు. అయితే అజర్‌ సేవలను వినియోగించుకునేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. క్రికెట్‌లో సమస్యలు చెప్పాలని ఆయనను కోరాం’ అని వివేక్‌ వివరించారు.

బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని, కేవలం ఐపీఎల్‌ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే సంస్థను నడిపిస్తున్నామని వివేక్ తెలిపారు. హెచ్‌సీఏ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. లోధా కమిటీ నియమ, నిబంధనల ప్రకారమే ముందుకెళ్తామని పేర్కొన్నారు. హెచ్‌సీఏలో జరిగే ప్రతీ అంశాన్ని అంబుడ్స్‌మెన్ కమిటీ పరిశీలిస్తోందన్నారు. తమకు ఎవ్వరితోనూ ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు.

అవినీతి ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ కార్యదర్శి పోస్టు నుంచి సస్పెన్షన్‌కు గురైన శేష్‌ నారాయణ భవితవ్యంపై అంబుడ్స్‌మన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇదిలావుంటే సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న శేషునారాయణ్ తనకు మంచి మిత్రుడని వివేక్‌ అన్నారు. రోజూ రాత్రి 11 గంటలకు శేషునారాయణ్ తనకు ఫోన్‌ చేస్తాడని వివేక్ చెప్పారు.