కాంగ్రెస్ పార్టీకీ ఐటీ నోటీసులు

03 December, 2019 - 8:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు పాల్పడిన ఓ కంపెనీ నుంచి విరాళాలు సేకరించిన కేసులో కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ మంగళవారం నోటీసులు జారీ చేసింది. రూ. 3300 కోట్ల హవాలా అక్రమాలకు పాల్పడిన హైదరాబాద్‌కి చెందిన కంపెనీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ. 170 కోట్లు విరాళాలు కింద వివిధ మార్గాల్లో వెళ్లినట్లు ఈ నోటీసుల్లో ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. దీనిపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ సూచించింది.

గత నెలలో సదరు కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, ఈరోడ్, పుణె, ఆగ్రా, గోవా తదితర నగరాల్లో మొత్తం 42 ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా సదరు సంస్థ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది.

అంతేకాకుండా ఈ కంపెనీకి చెందిన వారు బోగస్ బిల్లులు, హవాలా మార్గంలో భారీగా లావాదేవిలు జరిపినట్లు సైతం తాము కనుగొన్నామని ఐటీ శాఖ వివరించింది. అతేకాకుండా.. తమ దాడులో 4.2 కోట్లు నగదు, 3.2 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు సైతం సీజ్ చేశామని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అయితే హైదరాబాద్‌లోని సదరు కంపెనీపై దర్యాప్తు కొనసాగుతోందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.