మహిళా టీ20 కెప్టెన్లుగా స్మృతి, హర్మన్‌ప్రీత్

16 May, 2018 - 5:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: మహిళా క్రికెటర్ల కోసం ఈ నెల 22న ప్రత్యేకంగా నిర్వహించే ఒకే ఒక టీ20 చాలెంజ్‌ మ్యాచ్‌‌లో పాల్గొనే రెండు జట్లకు స్మృతి మంధాన, హర్మన్‌‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ముంబైలో జరిగే ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌‌కు ముందు ఈ మ్యాచ్‌‌ నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

‘ఈ మ్యాచ్‌‌లో పాల్గొనేందుకు ఆయా జట్ల క్రికెట్‌ బోర్డులతో సంప్రదింపులు చేశాం. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సుజీ బేట్స్, సోఫీ డివైన్, ఆసీస్‌ ఆల్‌‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ, వికెట్‌ కీపర్‌ అలీసా హీలీ, మెగాన్‌ షుట్, బెథ్‌ మూనీ, ఇంగ్లండ్‌ అమ్మాయిలు వ్యాట్, హేజెల్‌ ఈ మ్యాచ్‌‌లో ఆడేందుకు సిద్ధమని తెలిపారు’ అని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా వివరించారు.

గత ఏడాది భారత జట్టు వన్డే వరల్డ్‌ కప్‌‌లో రన్నరప్‌‌గా నిలిచిన తర్వాత… మహిళల క్రికెట్‌‌కు మరింత ప్రాచుర్యం కల్పించే చర్యల్లో భాగంగా ఐపీఎల్‌ తరహాలో మహిళా క్రికెటర్లకు ఓ లీగ్‌ నిర్వహించాలని పలువురు బీసీసీఐని కోరారు. ఫలితంగా ఈ ఐపీఎల్‌‌లో భారత్‌‌తో పాటు అంతర్జాతీయ మహిళా క్రికెటర్ల మధ్య ప్రయోగాత్మకంగా మ్యాచ్‌ నిర్వహించాలని ఐపీఎల్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది.