‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాళ్లకే నచ్చలేదు’

11 October, 2018 - 7:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సంగారెడ్డి: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి టి. హరీష్ రావు స్పందించారు.

గురువారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌లోని అందోల్ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ కుటుంబ సభ్యులకే నచ్చని ఆ పార్టీ మేనిఫెస్టో ప్రజలకేం నచ్చుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రజల్లో లేని కాంగ్రెస్‌ పార్టీ.. వారి మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ ఆయన విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ నుంచి రోజుకొకరు పార్టీ మారుతున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సీఎంలుగా రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్న హయాంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి నోరు మెదపలేదని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల విద్యుత్‌ను అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మిర్యాలగూడలో నిర్మించే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేయిస్తామన్న కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌ స్పందించారు. అది కోమటిరెడ్డి ప్రకటనా.. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనా? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.