ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరి రాజీనామా

17 April, 2018 - 11:08 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో హరిబాబు రాజీనామాపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది.

కాగా.. సోమవారం సాయంత్రమే తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు హరిబాబు పంపించారు. వచ్చేది ఎన్నికల సంవత్సరమని తన లేఖలో గుర్తు చేసిన ఆయన, యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతమని, వారికి అవకాశాల కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు. నాలుగేళ్లపాటు తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు చెబుతూ, ప్రతి ఒక్కరినీ కలుపుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషిచేశానని అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

ఇలా ఉండగా.. మరో వారం రోజుల్లో ఏపీకి కొత్త అధ్యక్షుడ్ని నియమిస్తారని తెలుస్తోంది. మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు ఆ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వైదొలగడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏపీలో పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గిందని, ఈ నిర్ణయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌‌చార్జి రాంమాధవ​ కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది.